భువనగిరి అర్బన్, జూలై 10 : గీత కార్మికులకు పెండింగ్లో ఉన్న ఎక్స్గ్రేషియా వెంటనే చెల్లించాలని తెలంగాణ రాష్ట్ర గీత పనివారల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బొమ్మగాని ప్రభాకర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం తెలంగాణ రాష్ట్ర గీత పనివారాల సంఘం యాదాద్రి భువనగిరి జిల్లా సమితి ముఖ్య నాయకుల సమావేశం భువనగిరి సిపిఐ పార్టీ ఆఫీసు ధర్మం భిక్షం భవన్లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట నాయకుడు, అఖిల భారత గీత కార్మిక ఉద్యమ నాయకుడు బొమ్మగాని ధర్మభిక్షం నాయకత్వంలో రాష్ట్రంలో కల్లుగీత సొసైటీలు, టీఎఫ్టీలు ఏర్పాటు చేశారన్నారు. గీత కార్మికులకు పెన్షన్స్, ఎక్స్గ్రేషియా, కార్మికుల హక్కుల కోసం తాటి, ఈత వనములు పెంచుకొనుటకు జీవో 560 ప్రకారంగా ప్రతి సొసైటీకి ఐదు ఎకరాల భూమిని ఇచ్చే విధంగా గీత వృత్తిని ఆధునీకరించాలని చెప్పారు. గీత పరిశ్రమలు నెలకొల్పుటకు, గీత కార్మికుడు తాటిచెట్టు ఎక్కి ప్రమాదవశాత్తు జారిపడినచో ఐదు లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని, 50 సంవత్సరాల పైబడిన గీత కార్మికులకు వృత్తి పెన్షన్ ఇవ్వాలని, ప్రతి జిల్లాలో నీరా కేంద్రాలను ఏర్పరచి పరిశ్రమగా రూపొందించాలని డిమాండ్ చేశారు.
ఆయా జిల్లాల్లో పెండింగ్లో ఉన్న ఎక్సిగ్రేషియాలను వెంటనే చెల్లించాలని, గీత కార్మికుల వృత్తి పెన్షన్ రూ.2 వేలను రూ.5 వేలకు పెంచాలని, తాటి చెట్టుపై నుండి కిందపడి మరణించినచో రూ.10 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని, చనిపోయిన కార్మికుడి వృత్తి పెన్షన్ వస్తే అతడు మరణించినచో అట్టి పెన్షన్ను భార్యకు వృత్తి పెన్షన్ వర్తింపజేయాలన్నారు. భువనగిరి జిల్లాలో ఉన్న నందనంలోని నీరా పరిశ్రమ కేంద్రాన్ని ఆధునికరిం చాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో గీత పనివారల సంఘం రాష్ట కార్యదర్శి బొలగాని సత్యనారాయణ, జిల్లా గీత పనివారల సంఘం అధ్యక్ష కార్యదర్శుడు చాపల అంజయ్య, నాయకులు పబ్బు యాదయ్య, ఎర్ర రమేశ్, పందుల యాదగిరి, బాలగోని సత్యనారాయణ, గాదెగాని మాణిక్యం, గుండు వెంకటేష్, తండా యాదయ్య, పుట్ట రమేష్ పాల్గొన్నారు.