ఆలేరు టౌన్, జూలై 19 : తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పథకాలను సఫలీకృతం చేయడంలో విఫలమైన రేవంత్ రెడ్డి ఎనుముల రేవంత్రెడ్డి కాదు.. ఆయన ఎగవేతల రేవంత్ రెడ్డి అని భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ అన్నారు. శనివారం ఆలేరు పట్టణ కేంద్రంలోని రహదారి బంగ్లాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాజీపేటలో ఏర్పాటు చేసే కోచ్ ఫ్యాక్టరీలో రైలు ఇంజిన్తో పాటు, భోగిలను, ట్రాక్ పట్టాలను తయారు చేయడం జరుగుతుందన్నారు. కోచ్ ఫ్యాక్టరీ ద్వారా అనేకమంది కార్మికులకు ఉపాధి కల్పించడం జరుగుతుందన్నారు. తాను ఎంపీగా ఉన్న సమయంలోనే భువనగిరిలో కేంద్రీయ విద్యాలయం, ఫోర్ట్ రాక్, బీబీనగర్ ఎయిమ్స్ కు బీజం పడ్డట్లు తెలిపారు.
రాష్ట్రంలో జీపీఎఫ్ నిధులు రూ.10 వేల కోట్లు పెండింగ్లో ఉన్నట్లు తెలిపారు. ప్రభుత్వం ఆ నిధులను కూడా వాడుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఆలేరు అసెంబ్లీ కన్వీనర్ చిరిగే శ్రీనివాస్, ముట్కూరు అశోక్ గౌడ్, జిల్లా ఓబీసీ మాజీ కార్యదర్శి కామిటి కారి కృష్ణ, జిల్లా మాజీ ఉపాధ్యక్షుడు బడుగు జహంగీర్, నరసింహారెడ్డి, నర్సిరెడ్డి, పట్టణ అధ్యక్షుడు నంద గంగేశ్, రూరల్ అధ్యక్షుడు కుమారస్వామి, మాజీ అధ్యక్షుడు రాఘవేంద్ర, జిల్లా కౌన్సిల్ సభ్యుడు వడ్డేమాన్ నరేందర్, ప్రధాన కార్యదర్శి సుంకరి సృజన్, వెలుగుల వెంకటేశ్ పాల్గొన్నారు.