– భువనగిరి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఆల్వా మోహన్ రెడ్డి
బీబీనగర్, జనవరి 07 : తెలంగాణ రాష్ట్రంలో సహకార బ్యాంకులు, సహకార సంఘాలకు నామినేటెడ్ డైరెక్టర్లు–చైర్మన్ల నియామకం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని, తక్షణమే ఎన్నికలు నిర్వహించాలని భువనగిరి మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ ఆల్వ మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎన్నికలు లేకుండా నామినేటెడ్ పద్ధతిలో పాలకులను నియమించడం ద్వారా సహకార వ్యవస్థను రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చే ప్రయత్నం జరుగుతోందని తీవ్రంగా విమర్శించారు. నామినేటెడ్ విధానంలో వచ్చిన వారు రాజకీయ ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇస్తారని, రైతులకు అవసరమైన సమయంలో అందుబాటులో ఉండరని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికైన డైరెక్టర్లు, చైర్మన్లు ఉంటే ప్రతి గ్రామానికి ప్రతినిధ్యం లభిస్తుందని, స్థానిక సమస్యలపై సలహాలు–సూచనలు అందించి సహకార వ్యవస్థను బలోపేతం చేస్తారన్నారు. ఎరువుల సమాచారం, విత్తనాల లభ్యత, వడ్ల సేకరణ వంటి కీలక విషయాలు అవసరమైన రైతులకు వెంటనే చేరతాయని వివరించారు.
రైతు బంధు నిధులు సమయానికి విడుదల కాకపోవడం, రుణమాఫీ పూర్తిగా అమలు కాకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని గుర్తు చేశారు. ఎరువుల పంపిణీకి తీసుకొచ్చిన కొత్త యాప్ వల్ల ప్రయోజనం లేదని, ఎరువుల దుకాణాల ముందు రైతులు క్యూలైన్లలో గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోందని విమర్శించారు. ప్రభుత్వం దీనిపై పట్టించుకోవడం లేదని ఆరోపించారు. వరి నాట్లు పూర్తయినప్పటికీ ఇప్పటివరకు రైతు బంధు అందక రైతులు ఆర్థిక ఒత్తిడిలో ఉన్నారని, ఇప్పటివరకు ఇవ్వాల్సిన నాలుగు విడతల్లో రెండు విడతలే అందాయని తెలిపారు. వెంటనే రైతు బంధు నిధులు విడుదల చేయాలని, డీసీసీలను నియమించి సహకార వ్యవస్థను బలోపేతం చేయాలని డిమాండ్ చేశారు. నామినేటెడ్ చైర్మన్లు–డైరెక్టర్లు కాంగ్రెస్ పార్టీకి ఉపయోగపడతారనే భావన తప్ప రైతులకు ఏ మాత్రం మేలు ఉండదని, ఈ నిర్ణయాన్ని ముఖ్యమంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి వెంటనే వెనక్కి తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.