భువనగిరి అర్బన్: విద్యాసంస్థలు ప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యా సంస్థల బస్సులు వాహన నిబంధనలు ఉల్లంఘిస్తే బస్సులను సీజ్ చేస్తామని జిల్లా రవాణ శాఖాధికారి యాస సురేందర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం విలేకరులో మాట్లాడుతూ పాఠశాలలు, కళాశాలలు తిరిగి ప్రారంభిస్తున్న క్రమంలో విద్యార్థులను ఇంటి నుంచి తీసుకెళ్లే బస్సులు, వాహనాలు విధిగా ఫిట్నెస్ చేయించుకోవాలన్నారు.
వాహనాలను విధిగా పరిశీలించుకుని, మరమ్మతులు చేయించి సామర్థ్య పరీక్షకు రవాణా కార్యాలయానికి తీసుకువచ్చి వాహన తనిఖీ అధికా రులతో దృవీకరణ చేయించుకోవాలన్నారు. ఫిట్నెస్, తగిన సామర్థ్యం లేకుండా వాహనాలు పట్టుబడితే చర్యలతో పాటు వాహనాలను సీజ్ చేస్తామని చెప్పారు. బస్సు డ్రైవర్ 60సంవత్సరాల లోపు ఉండి హెవీ వెహికిల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి అనుభవం ఉన్న డ్రైవర్‌ను నియమించి విద్యార్థులను సురక్షితంగా గమ్యస్థానానికి చేర్చాల్సిన భాద్యత విద్యాసంస్థలపై ఉందన్నారు.
కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం రవాణా వాహనాల ఫిట్నెస్, పర్మిట్ తదితర పత్రాలు ఈనెల 30లోపు చెల్లుబాటు అయినప్పటికీ ప్రతి వాహనం తప్పనిసరిగా కలిగి ఉండాలన్నారు. తగ కొన్ని నెలలుగా విద్యాసంస్థల మూసివేతల వల్ల బస్సులను తిప్పని కారణంగా బస్సులలో పరికరాలు చెడిపోయి ఉంటాయని, వాటిని చెకింగ్ చేయిచుకుని, సెప్టంబర్ 1 వరకు సిద్ధంగా ఉంచాలన్నారు.