యాదాద్రి భువనగిరి (నమస్తేతెలంగాణ) /నాంపల్లి/మర్రిగూడ/చండూరు, నవంబర్1 : “నల్లాల ద్వారా ఇంటింటికీ నీళ్లు ఎలా ఇచ్చామో.. మీ పొలాలకు కాల్వల ద్వారా అట్లనే నీళ్లిస్తం. శివన్నగూడెం ప్రాజెక్ట్‌ను పూర్తి చేస్తాం. కొద్ది రోజుల్లో కృష్ణా జలాలు ఇచ్చి తీరుతాం. బీజేపీవాళ్లు పైసల బలంతో గెలుస్తమంటున్నరు. పైసల బలం గెలవాలా.. ప్రజా బలం గెలవాలా..? అన్నం పెట్టిన చేయిని మరుస్తమా..? మనకు అన్నం పెట్టిందెవరో..? సున్నం పెట్టిందెవరో ఆలోచించి నిర్ణయం తీసుకోండి. టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించండి..” అని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి గెలుపును కాంక్షిస్తూ మంగళవారం మర్రిగూడ, నాంపల్లి, చండూరు మండల కేంద్రాల్లో రోడ్‌షోల్లో పాల్గొన్నారు. దీనికి రైతులు, మహిళలు, యువత, ముసలోళ్లు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు ప్రసంగిస్తూ తెలంగాణకు అన్యాయం చేస్తున్న బీజేపీకి బుద్ధి చెప్పాలన్నారు. బీజేపీ నేతలు ఉచితాల పేరుతో సంక్షేమ పథకాలను బంద్ చేయాలనే కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. బోరు బావుల కాడ మీటర్ పెట్టాలంటున్నారని, ముకుపిండి డబ్బులు వసూలు చేయమంటున్నరని వివరించారు.
అభివృద్ధి కావాలంటే కారే గెలువాలే..
“ఈ ఉప ఎన్నిక ఎందుకు వచ్చిందో మీకు తెలుసు. రాజగోపాల్‌రెడ్డి కేవలం రూ.18 వేల కోట్ల కాంట్రాక్టుల కోసం రాజీనామా చేసిండు. ఆయన స్వార్థం కోసం వచ్చిన ఎన్నిక ఇది. ఆయన గెలిశాక ఒక రోజు కూడా నియోజకవర్గానికి రాలేదు. సీఎం కేసీఆరే అధికారంలో ఉంటారు. అభివృద్ధి చేయాలి అంటే మేమే చేయాలి. ఆయన గెలిచినా.. ఓడినా ఇకడ ఉండడు. ఆయన కాంట్రాక్టర్ల కోసం ఢిల్లీకి పోతారు తప్ప.. ఇక్కడికి వస్తారా..? మహిళలు నీళ్ల బిందెలు ఎత్తుకోక ఎన్ని రోజులు అవుతుంది..? నీళ్లు ఇచ్చిన కేసీఆర్‌కు అండగా ఉందామా.. వద్దా? సీఎం కేసీఆర్‌కు అండగా ఉండాలంటే మునుగోడులో ఓటు వేసి కారు, సారును గెలిపించాలి” అని విజ్ఞప్తి చేశారు.
ఎమ్మెల్యేగా గెలిపిస్తే రాజగోపాల్‌రెడ్డి ఏం చేసిండు..?
“గతంలో కాంగ్రెస్, టీడీపీకి ఓట్లు వేసి గెలిపించినా ఏం చేయలేదు. మంచి నీళ్ల గోస ఉండే. వాటర్ ట్యాంకర్ నుంచి నీళ్లు తెచ్చి మీ భుజాలు కాయలు కాయలేదా..? ఇవాళ ఇంటింటికీ నీళ్లు ఇచ్చిన కేసీఆర్‌ను కాదంటారా? మీరే ఆలోచించండి. బీజేపీతో మాట్లాడుకుని రాజగోపాల్‌రెడ్డి రూ.18వేల కోట్ల కాంట్రాక్టు తెచ్చుకున్నడు. ఇది స్వయంగా రాజగోపాల్ రెడ్డే ఒప్పుకున్నడు. ఆయన ఎమ్మెల్యేగా ఉంటే మునుగోడు ప్రజలకు ఏమైనా వచ్చిందా..? కనీసం మహిళలు కూర్చోవడానికి ఓ మహిళా సంఘ భవనం కట్టలే. ఏనాడూ మీ దగ్గరకు రాలే. దున్నపోతుకు గడ్డి వేసి.. బర్రెకు పాలు పిండితే రావు. నాలుగేండ్లుగా ఏ ఒక పని చేయని రాజగోపాల్‌రెడ్డి రేపు ఎట్లా చేస్తారు. నిన్నటి దాకా కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నవ్. గెలిచే ప్రసక్తే లేదు. గెలిస్తే బీజేపీ ఎమ్మెల్యే అయితవు తప్ప ఏం చేస్తావ్. రాజగోపాల్‌రెడ్డికి రూ.18 వేల కోట్ల కాంట్రాక్టు వచ్చింది. డబ్బులు బాగా ఉన్నయ్. బాగానే పంచవచ్చు. అవి ఒకరోజు ఇస్తడు. కానీ, ఆసరా పెన్షన్, కల్యా ణలక్ష్మి, రైతుబంధు, రైతుబీమా, తాగునీళ్లు, పది కేజీల బియ్యం ఇస్తున్నది కేసీఆర్.’ అని వివరించారు.
త్వరలోనే కృష్ణా జలాలు ఇచ్చి తీరుతం..
“గతంలో ఎవరైనా చనిపోతే స్నానం చేసేందుకు కూడా కరెంట్ ఉండకపోయేది. ఆనాడు కరెంట్ లేక బోరు మోటర్లు ఎండిపోయేవి. వాన దేవుడు కూడా టీఆర్ఎస్ పార్టీలో చేరాడు. శివన్నగూడెం ప్రాజెక్ట్‌ను పూర్తి చేస్తాం. రానున్న కొద్ది రోజుల్లో కృష్ణాజలాలు ఇచ్చి తీరుతం. అన్ని కులాలకు ఆపద్బాంధవుడిగా కేసీఆర్ ఉన్నారు. దళితబంధు స్టార్ట్ చేసినం. ఆడ పిల్ల పెండ్లికి ఇచ్చే లక్ష రూపాయలు ఉచితమంట. దాన్ని బంద్ చేయమంటున్నరు. బీజేపీ నేతలు తిట్ల పురాణం తప్ప చేసేదేంటి..? చేనేతపై జీఎస్టీ కోసం చాలా మాట్లాడారు. నేను హైదరాబాద్‌లో రుజువులతో సహా అన్నీ మాట్లాడితే బండి సంజయ్, కిషన్‌రెడ్డి తలకాయ కిందికేసుకున్నరు. ఒకరూ మాట్లాడటం లేదు. తెలంగాణ చేనేతపై జీఎస్టీని వ్యతిరేకించిందని చెబితే కికురమంటలేరు. అకాచెల్లెళ్లు ఇంటి ముందు నల్లాలను చూడండి. ఓటుకు పోయే ముందు వంట రూమ్‌లో గ్యాస్ సిలిండర్ చూసి కసికసిగా కారు గుర్తుకు ఓటు వేయండి” అని పిలుపునిచ్చారు.
బీజేపీకి దిమ్మదిరిగింది
‘వడ్లు కొనమంటే చేతగాలే గానీ, ఎమ్మెల్యేలను కొంటరంట. దెబ్బ కొడితే బేజేపీ దిమ్మ తిరిగింది. కేసీఆర్ గారిదెబ్బకు బీజేపీ నేతలు ముఖం చాటేసుకున్నరు’.. అని మంత్రి పేర్కొన్నారు. ఒక్క జాతీయ నాయకుడు ఇటు దిక్కు చూడటం లేదని, ఢిల్లీకెళ్లి వచ్చిన బీజేపీ దూతలు చంచల్‌గూడ జైలులో ఉన్నారన్నారు. ఢిల్లీ బీజేపీ నాయకులు, కేంద్ర మంత్రులు ఇక ఇటు రావడానికి గజగజలాడుతున్నారని చెప్పారు. ‘ఎమ్మెల్యేలను కొంటం.. మా దగ్గర పైసలున్నయి.. మాకు ఈడీ ఉంది.. ఇన్‌కం టాక్స్ ఉందని భయపెట్టిస్తం.
కాంట్రాక్టులిస్తం అన్న అహంకారం ఉందని, ఢిల్లీ అహంకారం గెలువాలా? తెలంగాణ ఆత్మగౌరవం గెలువాలా? ఆలోచించండి’ అని మంత్రి సూచించారు.
హరీశ్‌రావు వరాలు
ఎన్నికల ప్రచారంలో మంత్రి హరీశ్‌రావు వరాల వర్షం కురిపించారు. మహిళలకు రుణాలు ఇస్తామని ప్రకటించారు. ఎన్నికల కోడ్ ముగియగానే అంగడిపేటకు వచ్చి బస్తీ దవాఖాన మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. అంగడిపేటలో డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరు చేస్తానని తెలిపారు. చండూరులో రోడ్ల అభివృద్ధికి రూ.50 కోట్లు, వెయ్యి డబుల్ బెడ్రూం ఇండ్లు, పెద్దాస్పత్రి, మోడల్ స్కూల్ మంజూరుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఆయా కార్యక్రమాల్లో మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్, విప్ బాల్క సుమన్, ఎమ్మెల్యేలు రవీంద్రకుమార్, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, ఆరూరి రమేశ్, పెద్ద సంఖ్యలో టీఆర్ఎస్, వామపక్షాల శ్రేణులు పాల్గొన్నారు.