భువనగిరి అర్బన్, సెప్టెంబర్ 12 : పలు చోట్ల దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను భువనగిరి పోలీసులు అరెస్టు చేసి సోమవారం రిమాండ్‌కు తరలించారు. డీసీపీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ నారాయణరెడ్డి వివరాలను వెల్లడించారు. తూర్పుగోదావరి జిల్లా పోలవరం గ్రామానికి చెందిన ఒల్లేటి మహలచాలురావు, నీలపల్లికి చెందిన గోపయి వెంకటేశ్, గోపయి అక్షయ్‌కుమార్, కల్యాణపు ఫణింద్రసాయి, కొట్రేనికోనకు చెందిన రామాడి రామాంజనేయులు, గోపయి సాయికుమార్ స్నేహితులు. వీరంతా ముఠాగా ఏర్పడి ఏపీ, తెలంగాణలో దొంగతనాలకు పాల్పడుతున్నారు. పలు కేసుల్లో జైలుకు పోయి వచ్చారు. 2021లో నల్లగొండ జిల్లాలోని పలు ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడగా వీరిపై 21 కేసులు నమోదు అయ్యాయి. ఒలేటి మహలచాలును అరెస్ట్ చేసి నల్లగొండ జైలుకు జ్యల్ రిమాండ్‌కు పంపారు.
ఈ సమయంలో మహలచాలుకు యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలోని పోచమ్మవాడకు చెందిన గజ్జల శ్రీనివాస్‌రెడ్డితో పరిచయం ఏర్పడింది. మహలచాలు జైలు ఎస్కార్ట్ నుంచి ఈ ఏడాది జూన్‌లో తప్పించుకున్నాడు. జైలు నుంచి బయటకు వచ్చిన శ్రీనివాస్‌రెడ్డి సైతం వీరితో జతకట్టాడు. ఈ క్రమంలో సోమవారం భువనగిరి పట్టణ పరిధి నల్లగొండ బైపాస్ మార్గంలో పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టగా అనుమానాస్పదంగా సంచరిస్తున్న మహలచాలు, గోపయి వెంకటేశ్‌ను అదుపులోకి తీసుకుని విచారించడంతో చోరీల విషయం వెలుగు చూసింది. నిందితుల నుంచి మూడు బైక్‌లు, మూడు తులాల బంగారం, నగదు రూ.50 వేలు, 19 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను ఇద్దరిని అరెస్టు చేసినట్లు, మిగతా వారు పరారీలో ఉన్నట్లు చెప్పారు. మహలచాలుపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 62 కేసులు నమోదైనట్లు వెల్లడించారు. సమావేశంలో పట్టణ సీఐ సత్యనారాయణ, ఎస్ఐ బి.వెంకటయ్య, సిబ్బంది పాల్గొన్నారు.