భువనగిరి కలెక్టరేట్, జూలై 7 : ప్రభుత్వ కళాశాలల్లో అందిస్తున్న మెరుగైన విద్య, మౌలిక సదుపాయాలు, బోధనా అంశాలపై ప్రజల్లో అవగాహన కల్పించి ప్రవేశాల సంఖ్య పెంచాలని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా ఇంటర్మీడియట్ అధికారి, ప్రభుత్వ జూనియర్ కళాశాలల ప్రిన్సిపాళ్లతో గురువారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రభుత్వ కళాశాల విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలు, మౌలిక సదుపాయాలతో పాటు, అనుభవజ్ఞులైన అధ్యాపక బృందం బోధన తదితర అంశాలపై విస్తృత ప్రచారం చేయాలన్నారు. విద్యార్థులకు చదువుతో పాటు సామాజిక అంశాలు, క్రీడలపై ఆసక్తిని పెంపొందించాలని సూచించారు. జిల్లాలో అమలవుతున్న బుధవారం బోధన కార్యక్రమంలో భాగంగా ప్రతి విద్యార్థి బిగ్గరగా చదవడం అలవర్చుకున్నారన్నారు. అనంతరం ఇటీవల విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను పూలమాలలు, శాలువాతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ దీపక్ తివారీ, ఇంటర్మీడియట్ నోడల్ అధికారి రమణి, సంక్షేమ శాఖల అధికారులు యాదయ్య, మంగ్తానాయక్, సంబంధిత శాఖల అధికారులు, ప్రిన్సిపాళ్లు పాల్గొన్నారు.
ప్రతిభ చాటిన విద్యార్థులకు సన్మానం
భువనగిరి కలెక్టరేట్ / బీబీనగర్(భూదాన్‌పోచంపల్లి) / మోత్కూరు / మోటకొండూర్ / బొమ్మలరామారం / చౌటుప్పల్ : జిల్లావ్యాప్తంగా పది, ఇంటర్ ఫలితాల్లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను కలెక్టర్ పమేలా సత్పతి కలెక్టరేట్లో గురువారం ఘనంగా సన్మానించారు. ప్రభుత్వ వసతి గృహాల్లో చదివి పది ఫలితాల్లో 9జీపీఏ సాధించిన విద్యార్థులను అభినందించారు. వసతి గృహాల్లో చదివే విద్యార్థులు చదువుపైనే దృష్టి సారించాలన్నారు. భూదాన్‌పోచంపల్లి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉత్తమ మార్కులు సాధించిన బి.సరిత, శ్రావణి, హర్షిత, భార్గవిని అభినందించారు. మోత్కూరు మండలంలోని పాలడుగు గ్రామానికి చెందిన ముక్కాముల మనిషా ఇంటర్ ఫలితాల్లో జిల్లా టాపర్‌గా నిలవడంపై అభినందించారు. ఇంటర్ ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో సత్తా చాటిన మోటకొండూర్ మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతిబా పూలే బాలికల గురుకుల పాఠశాల విద్యార్థులను శాలువాతో సత్కరించి అభినందించారు. మోటకొండూర్ మండలలోని జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలో, బొమ్మలరామారం మండలంలోని మోడల్ స్కూల్లో 10జీపీఏ సాధించిన కొక్కలకొండ అక్షర, ఆరె వైష్ణవిని అభినందించారు. చౌటుప్పల్‌లోని బాలికల గురుకుల పాఠశాలను కలెక్టర్ సందర్శించి ఉత్తమ మార్కులు సాధించిన ఇంటర్, పది విద్యార్థులను సన్మానించారు.