జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేస్తున్న మోడల్ రైతు బజార్ నిర్మాణం పూర్తి చేసుకొని ప్రారంభానికి సిద్ధమైంది. సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్ రైతుబజార్ల తరహాలో దీని నిర్మాణం చేపట్టారు. దీనిని ప్రారంభించడం వల్ల రైతులు, వినియోగదారుల ఇబ్బందులు తీరనున్నాయి.
భువనగిరి అర్బన్, జనవరి 1: భువనగిరి మండలంతో పాటు తుర్కపల్లి, యాదగిరిగుట్ట, బొమ్మలరామారం, బీబీనగర్, వలిగొండ, ఆత్మకూర్(ఎం), ఆలేరు మండలాల నుంచి రైతులు ప్రతిరోజూ కూరగాయలు, ఆకుకూరలను భువనగిరి రైతుబజార్‌కు తీసుకు వస్తారు. పాత రైతు బజార్లో 69 షాపులు మాత్రమే ఉండడం వల్ల కొద్దిమంది రైతులకు మాత్రమే అవకాశం లభిస్తున్నది. మిగతా రైతులు తాము పండించిన కూరగాయలను హైదరాబాద్‌లోని బోయిన్పల్లి మార్కెట్‌కు తరలిస్తున్నారు. దీనికి తోడు వసతులు సక్రమంగా లేక పోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అన్ని రకాల కూరగాయలు లభించక వినియోగదారులు కూడా ఇతర ప్రాంతాలకు వెళ్తున్నారు. ప్రస్తుతం అన్ని హంగులతో కూరగాయల మార్కెట్ ఏర్పాటు చేయడం వల్ల రైతులందరికీ కూరగాయలు విక్రయించుకునే అవకాశం లభించే అవకాశం ఉంది.
వివిధ మార్కెట్లను పరిశీలించి..
పాత రైతుబజార్లో వసతులు సక్రమంగా లేక పోవడంతో విక్రయదారులు విషయాన్ని మార్కెట్ కమిటీ దృష్టికి తీసుకెళ్లారు. అన్ని వసతులతో మోడల్ రైతు బజార్‌ను ఏర్పాటు చేయాలని భువనగిరి మార్కెట్ కమిటీ తీర్మానించి విషయాన్ని చైర్మన్ సారధ్యంలో మార్కెటింగ్ అధికారులు, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. మోడల్ రైతుబజార్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.2.10కోట్లు మంజూరు చేసింది. మోడల్ కోసం ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం, అనకాపల్లి, గుంటూరు, అద్దంకి, విజయవాడ, ద్వారకాతిరుమల, సూర్యాపేట రైతుబజార్లను మార్కెట్ కమిటీ సందర్శించింది. పాత రైతుబజార్ స్థలం సరిపోక పోవడంతో నీటి పారుదలశాఖ నుంచి 20 గుంటల స్థలాన్ని సేకరించి ఏప్రిల్ 2017లో పనులు ప్రారంభించారు. కరోనా నేపథ్యంలో పనులు ఆలస్యం కాగా.. ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి చొరవతో పనులు ప్రస్తుతం పూర్తయ్యాయి.
అధునాతనంగా..
18 గుంటల స్థలంలో ఉన్న పాత రైతుబజార్లో కేవలం 69 స్టాళ్లు మాత్రమే ఉన్నాయి. ఇందులో 42 షాపులను అలాగే ఉంచి మిగతా వాటిని కూల్చివేశారు. మరో 74 స్టాళ్లను కొత్తగా ఏర్పాటు చేశారు. వీటిని కూరగాయలకోసం, పాతవాటిని ఆకుకూరల విక్రయానికి కేటాయించనున్నారు. మోడల్ రైతు బజార్లో రూ.60 లక్షలతో వసతులు కల్పించారు. రూ.30లక్షలతో సీసీ రోడ్లు, రూ.7లక్షలతో వాటర్ ప్లాంట్, రూ.7లక్షలతో గదులు, మరుగుదొడ్లు, రూ.3.50 లక్షలతో హైమాస్ట్ లైట్లు, రూ.11లక్షలతో ప్రహరీ నిర్మించారు.
త్వరలో ప్రారంభిస్తాం
ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి సహకారంతో మోడల్ రైతు బజార్‌ను నిర్మించాం. త్వరలో ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. రైతులకు, కొనుగోలు దారులకు ఇబ్బందులు కలుగకుండా స్టాళ్ల సంఖ్య పెంచాం. గజ్వేల్, సిరిసిల్ల, సిద్దిపేట మాదిరిగానే ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి అందించిన రూ.1.50 లక్షలతో తూకం దిమ్మె నిర్మిస్తున్నాం.
రైతుల కోసమే మోడల్ రైతుబజార్
రైతులు తాము పండించిన కూరగాయలు తీసుకొచ్చి అమ్ముకునేందుకు వీలుగా జిల్లా కేంద్రంలో మోడల్ రైతుబజార్ ఏర్పాటు చేశాం. పాత మార్కెట్లో దుకాణాలు సరిపోక పోవడంతో మరో 74 స్టాల్స్ ఏర్పాటు చేశాం. అన్ని వసతులు ఉన్నాయి. దాంతో రైతులతో పాటు కొనుగోలు దారులకు లబ్ధి చేకూరనుంది. రాష్ట్రంలోనే నాలుగో మోడల్ రైతుబజార్‌గా త్వరలో అందుబాటులోకి రానుంది.