యాదగిరిగుట్ట, జూన్ 05 : రాష్ట్ర తొలి సీఎం కేసీఆర్ రూ.183 కోట్లతో మల్లాపురం గ్రామానికి మంజూరు చేసిన వైద్య కళాశాలలకు వెంటనే శంకుస్థాపన చేసి నిర్మించాలని బీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు గౌడ శ్రీశైలం అన్నారు. లేకపోతే ఎమ్మెల్యే బీర్ల అయిలయ్యపై తిరుగుబాటు తప్పదని ఆయన హెచ్చరించారు. గురువారం మండలంలోని మల్లాపురం గ్రామంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. నేడు సీఎం రేవంత్రెడ్డి చేతులమీదుగా వైద్య కళాశాల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారని ప్రచారం సాగుతుందని, మల్లాపురం గ్రామానికి కాకుండా పక్కదారి పట్టించి గ్రామ యువతకు ఉపాధి అవకాశాలు లేకుండా చేయాలని ఎమ్మెల్యే చూస్తున్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నట్లు చెప్పారు. ఈ గ్రామాన్ని దత్తత తీసుకుంటానని ఎమ్మెల్యే ఇచ్చిన హామీని మరిచిపోవద్దని హితవు పలికారు.
గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎందుకు నోరు మెదపడం లేదో చెప్పాలన్నారు. గ్రామానికి మంజూరైన ఆరోగ్య ఉపకేంద్రం, కురుమ సంఘం భవనం నిర్మించకుండా చేస్తున్నారన్నారు. గ్రామంలో ప్రజలకు ఇష్టంలేని ప్రదేశంలో అంగన్వాడీ కేంద్రం నిర్మించారని, ప్రశ్నిస్తే అక్రమ కేసుల్లో ఇరికిస్తున్నట్లు తెలిపారు. తమ గ్రామ అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదన్నారు. గ్రామానికి వైద్య కళాశాల వచ్చే వరకు పోరాటం చేస్తామన్నారు. శుక్రవారం ఉదయం నిర్వహించే గ్రామ అభివృద్ది, యువత ఉపాధి కోసం ముఖ్య కార్యకర్తల సమావేశానికి హాజరుకావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ యువజన నాయకులు ఒగ్గు మల్లేశ్, చంద్రశేఖర్ పాల్గొన్నారు.