ఆలేరు టౌన్, ఆగస్టు 25 : ఆలేరు పట్టణ కేంద్రంలోని ఏడో వార్డులోని మార్కండేయ కాలనీ సమస్యల నిలయంగా మారింది. ఎన్నేండ్లైనా సమస్యలు పరిష్కారానికి నోచుకోకపోవడంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సమస్యల పరిష్కారం కోసం ప్రజా ప్రతినిధులు, అధికారులకు పలుమార్లు వినతి పత్రాలు అందజేసినా ఫలితం శూన్యం అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చేనేత కళాకారుల కోసం 1996లో కాలనీ నిర్మాణం చేసి పట్టాలను పంపిణీ చేయడం జరిగింది. 2020లో మార్కండేయ కాలనీగా వెల్ఫేర్ అసోసియేషన్ రిజిస్టర్ నెంబర్ 498- 2020గా చేసుకోవడం జరిగింది. కాలనీ నిర్మాణమై 30 సంవత్సరాలు కాగా, కాలనీ రిజిస్టర్ అయి ఐదు సంవత్సరాలు గడుస్తున్నా మార్కండేయ కాలనీకి సమస్యలు మాత్రం తీరడం లేదు. ఈ కాలనీలో రెక్కాడితే గాని డొక్కాడని చేనేత కళాకారులు తమ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. కాలనీలో మట్టి రోడ్లతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. సిసి రోడ్లు నిర్మించడంలో ప్రజాప్రతినిధులు శ్రద్ధ చూపకపోవడం, అధికారులు పట్టించుకోకపోవడం వల్ల ప్రజలకు మట్టిరోడ్లే దిక్కయ్యాయి. దీంతో చిన్నపాటి వర్షానికే కాలనీ రోడ్లు బురదమయంగా మారుతున్నాయి. ప్రజలు ఇంటిలో నుంచి బయటికి వెళ్లాలన్నా, ఇంటిలోకి రావాలన్నా, పిల్లలను బడికి పంపాలన్నా నరకయాతన పడవలసిన పరిస్థితి ఏర్పడిందని కాలనీవాసులు ఆరోపిస్తున్నారు.
కాలనీలో ఎక్కడపడితే అక్కడ రోడ్లు గుంతల మయంగా ఉండడం వల్ల అందులో వర్షపు నీరు చేరి చిత్తడిగా మారుతున్నాయి. కాలనీలో పగలు, రాత్రి అనకుండా పాములు, తేలులు, ఇతర క్రిమి కీటకాలు తిరగడంతో కాలనీవాసులు బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు. గతంలో ఏల చంద్రమౌళి ఇంట్లోకి రాత్రిపూట పాము దూరి నిద్రిస్తున్న ఆయన కుమారుడిని కాటు వేయగా చికిత్స పొందుతూ మరణించాడు.
కాలనీలో ఆరు వీధులు ఉన్నా ఏ వీధికి సరైన డ్రైనేజీ లేదు. గత ప్రభుత్వంలో కాలనీ మధ్యలో ఒక అండర్ డ్రైనేజీ నిర్మాణం చేపట్టిన కాంట్రాక్టర్ సక్రమంగా నిర్మాణం చేయక పోవడంతో నిర్మాణం పైనుంచి ట్రాక్టర్లు, భారీ వాహనాలు వెళ్లడంతో అందులో ఉన్న పైపులు పగిలి అండర్ డ్రైనేజీ వ్యవస్థ పాడయింది. కాలనీవాసులు తమ ఇంటి వద్ద నుంచి మధ్యలో ఉన్న అండర్ డ్రైనేజీ వరకు సొంత నిధులతో ప్లాస్టిక్ పైపులు వేసుకుని ఆ డ్రైనేజీలో కలిపినా ఫలితం లేకపోయింది. పలుమార్లు మున్సిపల్ అధికారులకు విన్నవించినా నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారని కాలనీవాసులు వాపోతున్నారు.
కాలనీ వాసులకు మిషన్ భగీరథ నీళ్లే జీవనాధారంగా మారింది. అప్పుడప్పుడు పైపులు పగడం వల్ల నాలుగు, ఐదు రోజులు కాలనీవాసులు నీటి కోసం ఎదురుచూడాల్సిన దుస్థితి. కాలనీలో వాటర్ పైప్లైన్లు సరిగ్గా లేక వాటర్ మ్యాన్ నీళ్లు వదిలినప్పుడు మూడు వీధులు డౌన్ ఉండడం వల్ల నీళ్లు అన్ని అక్కడికే వెళ్లిపోతున్నాయని కాలనీవాసులు వాపోతున్నారు. మున్సిపల్ కమిషనర్ దృష్టికి ఈ సమస్యను తీసుకపోయిన ఫలితం లేకుండా పోయిందన్నారు. కాలనీలో వాటర్ ట్యాంక్ నిర్మాణం చేయాలని కోరుతున్నారు.
ఆలేరు పట్టణంలో ఏడవ వార్డు కౌన్సిలర్ గా గెలిచి సిల్క్ నగర్, మార్కండేయ కాలనీలోని ప్రతి వీధిలో మట్టి పోశాం. మిషన్ భగీరథ పైపులు వేసి కేసిఆర్ మిషన్ భగీరథ నీటిని ప్రతి ఇంటికి అందించాం. కాలనీ మధ్యలో అండర్ డ్రైనేజీ నిర్మించాం. మార్కండేయ కాలనీలోని సిసి రోడ్ల కోసం రూ.2 కోట్లు కేటాయించి, మంతపూరి రోడ్ లోని ఫ్లైఓవర్ నుంచి రత్నాల వాగు వరకు రూ.98 లక్షలతో పనులకు కౌన్సిల్ తీర్మాణం కూడా చేయడం జరిగింది. ప్రభుత్వ మారడం వల్ల ఆలేరులో అభివృద్ధి కుంటుపడింది. నిధులు ఉన్న అభివృద్ధి కోసం ఉపయోగించకపోవడం బాధాకరం.
గతంలో కాలనీ అభివృద్ధి కోసం కౌన్సిల్ తీర్మాణం చేశారు. ఆలేరు మున్సిపాలిటీలో నిధులు ఉన్నవి. త్వరలోనే కాలనీలో ఉన్న సమస్యలను పరిష్కరిస్తాం. మంతపురి రోడ్ లో ఉన్న ఫ్లైఓవర్ నుంచి రోడ్డుకు ఇరువైపులా రత్నాల వాగు వరకు ఓపెన్ డ్రైనేజీని నిర్మిస్తాం.
Aleru : చినుకు పడితే చిత్తడే.. అభివృద్ధికి నోచుకోని మార్కండేయ కాలనీ