– భువనగిరి ప్రభుత్వ ఆస్పత్రిలో ఘటన
భువనగిరి అర్బన్, జూన్ 04 : భువనగిరి ప్రభుత్వ ఆస్పత్రిలో మానవత్వం మంటగలిపే దారుణ ఘటన చోటుచేసుకుంది. కన్న బిడ్డతో సహా ప్రాణాలు కోల్పోయిన ఒక నిండు గర్భిణి మృతదేహంపై నుండి మంగళసూత్రాన్ని (పుస్తెలతాడు) దొంగిలించిన అమానుష ఘటన గురువారం తీవ్ర కలకలం రేపింది. వలిగొండ మండలం వర్కట్పల్లి గ్రామానికి చెందిన గర్భిణి దాసరి సుస్మిత (36) బుధవారం హఠాత్తుగా అనారోగ్యానికి గురైంది. దీంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు బుధవారం రాత్రి చికిత్స కోసం భువనగిరి ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో రాత్రి వేళ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసింది. కడుపులోని బిడ్డతో సహా తల్లి మరణించడంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.
గర్భిణి మరణానంతరం పోస్టుమార్టం కోసం సుస్మిత మృతదేహాన్ని వార్డు నుండి మార్చురీకి తరలిస్తుండగా ఆమె మెడలో ఉండాల్సిన పుస్తెలతాడు కనిపించలేదు. చికిత్స సమయంలో సుస్మిత మెడలో బంగారు పుస్తెలతాడు ఉన్నట్లు డ్యూటీ డాక్టర్ సైతం ధ్రువీకరించారు. వార్డు నుండి మార్చురీకి మార్చే క్రమంలోనే ఇది మాయమైనట్లు స్పష్టమవుతోంది. దీంతో ఆస్పత్రి సిబ్బందే ఈ చోరీకి పాల్పడ్డారని సుస్మిత భర్త నాగరాజు, కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ప్రాణాలు పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న కుటుంబానికి అండగా ఉండాల్సింది పోయి, శవంపై నగలు దొంగిలించడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
బాధిత కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుతో స్థానిక పోలీసులు ఆస్పత్రికి చేరుకుని విచారణ ప్రారంభించారు. ఘటన జరిగిన సమయంలో వార్డులో ఉన్న సిబ్బంది, వార్డు బాయ్స్, సెక్యూరిటీని విచారిస్తున్నారు. ఆస్పత్రి పత్రి ఆవరణలోని సీసీ టీవీ కెమెరాల ఫుటేజీని కూడా పరిశీలిస్తున్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుని, తమకు న్యాయం చేయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. దొంగిలించిన వారు ఎవరైనా సరే కఠిన చర్యలు తప్పవని పోలీసులు తెలిపారు.