యాదాద్రి భువనగిరి, మే 5 : పుట్టింటికి వెళ్లిన భార్యను కాపురానికి రావాలని డిమాండ్ చేస్తూ ఓ యువకుడు సెల్ టవర్ ఎక్కి హల్చల్ చేశాడు. భూదాన్ పోచంపల్లి మండలంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని కాప్రాయపల్లి(Kapraipalli) గ్రామానికి చెందిన గంగాదేవి సాయి ప్రకాష్ (24)కు మూడేళ్ల క్రితం వివాహం జరిగింది. అయితే.. మద్యానికి బానిసైత అతడు రోజూ బాగా తాగొచ్చి భార్య స్వాతితో గొడవ పడేవాడు. దాంతో వారం క్రితం భార్య పుట్టింటికి వెళ్ళిపోయింది.
ఇటీవల గ్రామంలో పెద్దమనుషుల సమక్షంలో పంచాయతీ జరుగగా.. సాయి ప్రకాశ్ తన భార్యను తీసుకొచ్చి కాపురం చేసుకోవాలని తీర్మానించారు. అయతే.. ఉన్నట్టుండి మంగళవారం సాయి ప్రకాష్ స్థానిక మైసమ్మ గుడి వద్ద ఉన్న సెల్ టవర్ ఎక్కాడు. భార్యను కాపురానికి తీసుకురావాలని లేదంటే సెల్ టవర్ వద్ద ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించాడు.
అతడిని గమనించి స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. సాయి ప్రకాష్, అతడి భార్యతో మాట్లాడి కాపురానికి తీసుకొస్తామని నచ్చజెప్పారు. వెంటనే సెల్ టవర్ దిగమని అతడిని కోరారు. భార్యను తీసుకొస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో సాయి ప్రకాష్ సెల్ టవర్ దిగాడు. కానీ, పోలీసులు తనను ఏమన్నా అంటారోమోననే భయంతో అతడు పారిపోయాడు.