భూదాన్ పోచంపల్లి, జూన్ 11 : ఈ నెల 12న ఉదయం 10:30 గంటలకు భూదాన్ పోచంపల్లిలో నిర్వహించే రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పర్యటనను విజయవంతం చేయాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. బుధవారం రాష్ట్ర చేనేత జౌళి శాఖ డైరెక్టర్ వెంకటేశ్వరరావు, రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ పద్మ, డిసిపి ఆకాంక్ష యాదవ్, జిల్లా హ్యాండ్లూమ్ ఏడి శ్రీనివాసరావు, ఇతర అధికారులతో కలిసి స్థానిక టూరిజం పార్క్‌తో పాటు చేనేత కార్మికుల గృహాలను కలెక్టర్ సందర్శించారు. టూరిజం పార్క్‌లో చేనేత వస్త్రాల తయారీ విధానాలను గవర్నర్ పరిశీలించనున్న సందర్భంలో తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. టూరిజం పార్క్‌లో కాన్ఫరెన్స్ హాల్లో చేనేత కళాకారులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించనుండంతో అక్కడ చేయాల్సిన ఏర్పాట్లపై పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వినోబా మందిరం పక్కనే ఉన్న చేనేత కార్మికుల గృహాలను గవర్నర్ సందర్శించి మగ్గాలను ప్రత్యక్షంగా పరిశీలించి కార్మికుల జీవన స్థితిగతులను అడిగి తెలుసుకుంటారన్నారు. పోచంపల్లి ఇక్కత్ పరిశ్రమ విశిష్టత, కార్మికుల సాధకబాధకాలను తెలుసుకోనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో చౌటుప్పల్ ఆర్డీఓ శేఖర్ రెడ్డి, చౌటుప్పల్ ఏసీపీ మధుసూదన్ రెడ్డి, మండల తాసీల్దార్ పి.శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ అంజన్ రెడ్డి, స్థానిక ఎస్ఐ కంచర్ల భాస్కర్ రెడ్డి, జౌళి శాఖ అభివృద్ధి అధికారి రాజేశ్వర్ రెడ్డి, చేనేత నాయకులు తడక రమేశ్, అంకం పాండు, బొమ్మ హరిశంకర్, వల్లందాస్ ప్రవీణ్ పాల్గొన్నారు.