– సిఐటియు యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు కోమటిరెడ్డి చంద్రారెడ్డి
రాజాపేట, జనవరి 23 : కేంద్ర ప్రభుత్వం తెచ్చిన లేబర్ కోడ్స్, విబి జి రామ్ జి ఉపాధి చట్టం, జాతీయ విత్తన బిల్లు, విద్యుత్ సవరణ బిల్లులను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఫిబ్రవరి 12న జరిగే దేశవ్యాప్త సమ్మెలో భాగంగా రాజపేట మండల కేంద్రంలో నిర్వహించే సమ్మె ప్రదర్శన, సభల్లో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని సిఐటియు యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు కోమటిరెడ్డి చంద్రారెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం రాజాపేట మండలంలోని నెమిల, బూరుగుపల్లి, కుర్రారం, జాల, రాజపేట గ్రామాల్లో సిఐటియు గ్రామ సమన్వయ కమిటీలు వేసిన సందర్భంగా ఆయన పాల్గొని మాట్లాడారు. సమ్మెలో మండలంలోని గ్రామ పంచాయతీ, అంగన్వాడీ, ఆశ కార్యకర్తలు, మధ్యాహ్నం భోజన కార్మికులు, వీఓఏ, ఫీల్డ్ అసిస్టెంట్లు, స్కావెంజర్స్, మిషన్ భగీరథ, భవన నిర్మాణం, ట్రాన్స్పోర్ట్ డ్రైవర్స్, హమాలీలు పెద్ద ఎత్తున పాల్గొనాలన్నారు.
కేంద్రం తెచ్చే నూతన చట్టాలతో రానున్న కాలంలో ఉపాధి హామీ పనులు ప్రశ్నార్థకంగా మారనున్నాయని, విద్యుత్ సవరణ బిల్లు ద్వారా దేశవ్యాప్తంగా విద్యుత్‌ను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించే ప్రయత్నం చేస్తుందని, ఇది కనుక అమలు అయితే గ్రామాల్లో రైతులు చేసిన కష్టం కరెంట్ బిల్లులకే సరిపోనున్నదని తెలిపారు. రైతాంగం అప్పులపాలై గతంలో లాగా ఆత్మహత్యలు సంభవించనున్నట్లు చెప్పారు. విత్తన సవరణ బిల్లు ద్వారా విత్తనాల ధరలు మరింత పెరుగునున్నట్లు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్లకు రూ.16 లక్షల కోట్లు రాయితీలు ఇచ్చిందని, కానీ రైతులకు మాత్రం రుణమాఫీ చేయలేదన్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కార్మికుల వేతనాలు పెంచడం లేదన్నారు. కార్మికులను బానిసలుగా చూస్తూ రోజు వేతనం రూ.176గా నిర్ణయించారన్నారు. ఈ వేతనంతో ఒక వ్యక్తే బ్రతకలేని పరిస్థితి మరి కుటుంబం ఎట్లా బతుకుతుంది అని ఆయన ప్రశ్నించారు. అందుకే కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, రైతు, వ్యవసాయ కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ పార్టీలకతీతంగా ఐక్యంగా పోరాడాలని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో సీఐటీయు జిల్లా కమిటీ సభ్యురాలు, అంగన్వాడీ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు బూరుగు స్వప్న, గ్రామ పంచాయతీ యూనియన్ మండల అధ్యక్షుడు మొర్రి యాకయ్య, బీడీ సంఘం నాయకురాలు బీమనపల్లి విజయలక్ష్మి, భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకుడు సగ్గు ఆంజనేయులు, వీఓఏల సంఘం నాయకురాలు ఎర్రగోగుల అంజలి, ఆశ యూనియన్ నాయకురాలు బండి బాలమణి, గ్రామ పంచాయతీ యూనియన్ నాయకుడు కుడుదుల నాగరాజు, మధ్యాహ్న భోజనం యూనియన్ నాయకుడు బచ్చల లక్ష్మి, ఫీల్డ్ అసిస్టెంట్స్ యూనియన్ నాయకురాలు జెన్నే రజిత, స్కావెంజర్స్ నాయకుడు గడ్డం దయాకర్, నెమిల, బూరుగుపల్లి, కుర్రారం, జాల, రాజపేట గ్రామాల గ్రామ సమన్వయ కమిటీ కన్వీనర్లు మోత్కుపల్లి శోభారాణి, సుంకోజు మహేశ్వరి, ఊటుకూరు రవీందర్, బొడ్డు స్వప్న, రాపాక భాగ్యలక్ష్మి పాల్గొన్నారు.