సంస్థాన్ నారాయణపురం, జూన్ 18 : రిలయబుల్ ట్రస్ట్ లాంటి దాతల సహకారంతో ప్రభుత్వ బడులను చదువులమ్మ ఒడిగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని యాదాద్రి భువనగిరి జిల్లా విద్యాశాఖ అధికారి కె.సత్యనారాయణ తెలిపారు. హైదరాబాద్కు చెందిన రిలయబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సంస్థాన్ నారాయణపురంలోని జడ్పీ బాలికల, బాలుర ఉన్నత పాఠశాలలకు చెందిన 340 మంది విద్యార్థులకు రూ.3.50 లక్షల విలువైన స్కూల్ కిట్స్ ను డీఈఓ చేతుల మీదుగా ట్రస్ట్ మేనేజింగ్ తుపాకుల రవి బుధవారం అందజేశారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు దాతల సహకారంతో ఇంకా అత్యధిక ప్రామాణికమైన విద్యను అందించవచ్చు అన్నారు.
ప్రభుత్వ బడులను చదువులమ్మ ఒడిగా మార్చాలన్నదే ప్రభుత్వ సంకల్పం అన్నారు. విద్యార్థుల భవిష్యత్ తరగతి గదిలోనే తీర్చిదిద్దబడుతుందని, ఉత్తమ విద్యార్థులు దేశానికి ఎంతో అవసరమన్నారు. విద్యార్థులకు విద్యతో పాటు క్రమశిక్షణ, నైతిక విలువలు నేర్పాలని ఉపాధ్యాయులకు సూచించారు. అనంతరం దాత తుపాకుల రవిని శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ప్రమోద్ కుమార్, ఎంఈఓ గోలి శ్రీనివాసులు, హెచ్ఎంలు రమాదేవి, ఉష, ఉదయ, కేజీబీవీ ఎస్ఓ శివరంజని, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పర్నే శివారెడ్డి పాల్గొన్నారు.