భూదాన్ పోచంపల్లి, జూన్ 23 : ప్రభుత్వ భూమిని ఆక్రమిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని చౌటుప్పల్ ఆర్డీఓ శేఖర్ రెడ్డి అన్నారు. సోమవారం భూదాన్ పోచంపల్లి మండలం జలాల్పూర్ గ్రామం పరిధిలోని 80 సర్వే నంబర్లలోని భూమిలో నిరుపేదలు, గ్రామస్తులు గుడిసెలు వేశారు. ఈ విషయం తెలిసిన ఆర్డీఓ సంఘటన ప్రదేశానికి చేరుకుని బాధితులతో మాట్లాడారు. ప్రభుత్వం సర్టిఫికెట్ ఇస్తే లీగల్ అవుతుందని, లేకుంటే భూమిని ఆక్రమిస్తే చట్టరీత్యా శిక్షార్హులవుతారన్నారు. గ్రామంలో అర్హులైన పేదలు ఉంటే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వ అధికారులకు దరఖాస్తు చేసుకుంటే జిల్లా కలెక్టర్కు పంపించి వారి ఆదేశాల మేరకు సర్వే చేసి అర్హులైన పేదలను గుర్తించి ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరుగుతుందన్నారు. ప్రభుత్వ స్థలంలో గుడిసెలు వేయడం పొరపాటు అని, వెంటనే తొలగించాలని సూచించారు.
కాగా తమ గ్రామానికి చెందిన పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, భూమిలేని పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చేంతవరకు గుడిసెలు తొలగించేది లేదని బాధితులు డిమాండ్ చేశారు. తమ గ్రామానికి చెందిన భూమిలో వేరే వ్యక్తులకు కేటాయిస్తున్నారని, అధికారులకు పలుమార్లు దరఖాస్తు చేసుకున్నామని, నేటికీ ఇళ్ల స్థలాలు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 25న తాసిల్దార్ కార్యాలయం వద్దకు వచ్చి అర్హులైన పేదలందరు అధికారులకు దరఖాస్తులు సమర్పిస్తామని తెలిపారు. జలాల్పూర్ చెరువులో పడి యువకులు చనిపోయినా నేటికి రక్షణ చర్యలు చేపట్టలేదన్నారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు తమపై నిర్లక్ష్యం వహిస్తున్నారని, పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చి ఆదుకోవాలని బాధితులు కోరారు.
ఈ కార్యక్రమంలో తాసీల్దార్ పి.శ్రీనివాసరెడ్డి, ఎంపీడీఓ రాపర్తి భాస్కర్ గౌడ్, ఎంపీఓ మజీద్, ఎం ఆర్ ఐ గుత్తా వెంకట్ రెడ్డి, ఎస్ఐ కంచర్ల భాస్కర్ రెడ్డి, నాయకులు గోరంటి ప్రదీప్ రెడ్డి, నక్క శ్రీనివాస్ రెడ్డి, పాలకూర ఆగయ్య, ప్రసాదం విష్ణు, కోట రామచంద్రారెడ్డి, మంచాల మధు, బైరు బాలరాజు, గుండ్ల భాస్కర్, పర్వతం రంగయ్య, శాపాక స్వామి, బైరు శివాజీ, గుండ్ల శ్రీరాములు, గుండ్ల మహేశ్, పరమేశ్, గ్రామస్తులు పాల్గొన్నారు.
Bhoodan Pochampally : ప్రభుత్వ భూమి ఆక్రమిస్తే చట్టరీత్యా చర్యలు : చౌటుప్పల్ ఆర్డీఓ శేఖర్ రెడ్డి