రామన్నపేట, జూన్ 25 : రామన్నపేట మండలంలోని కొమ్మాయిగూడెం గ్రామంలో ధర్మారెడ్డిపల్లి కాల్వ పనుల పునర్నిర్మాణంలో ఇండ్లు, ఇంటి స్థలాలు కోల్పోకుండా పేదలను ఆదుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు జల్లెల పెంటయ్య ప్రభుత్వాన్ని కోరారు. బుధవారం ధర్మారెడ్డిపల్లి కాల్వ భూ బాధితులతో కలిసి జిల్లా కలెక్టర్ హనుమంతరావుకు వినతిపత్రం అందజేశారు. అనంతరం మాట్లాడుతూ.. ధర్మారెడ్డిపెల్లి కాల్వ పునర్నిర్మాణ పనుల సందర్భంగా కొమ్మాయిగూడెం గ్రామంలో సుమారుగా 15 పేద కుటుంబాలకు చెందిన ఇండ్లు, ఇంటి స్థలాల మధ్యలో నుండి ఇరిగేషన్ అధికారులు మార్కింగ్ పెట్టడంతో బాధితులు భయాందోళనకు గురైతున్నట్లు తెలిపారు.
గతంలో భూములు కోల్పోయిన రైతులకే ఇప్పటికీ కొంతమందికి డబ్బులు అందలేదని, మళ్లీ కష్టపడి కట్టుకున్న ఇండ్లు, కొనుక్కున్న ఇంటి స్థలాలు పోతే పేదలు తీవ్రంగా నష్టపోతారన్నారు. వెంటనే ప్రభుత్వ అధికారులు స్పందించి వేరే ప్రత్యామ్నాయం చూపాలని లేనిపక్షంలో ఆందోళన చేపడుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా కార్యదర్శి మాటూరి బాలరాజు, శానగొండ వెంకటేశ్వర్లు, తిరుపాల పాండు, జాల చంద్రయ్య, జాల జంగయ్య, బాలగోని గణేష్, బాత్క బుగ్గస్వామి, బాత్క మహేష్, జాల భారతమ్మ, జాల జంగమ్మ, తిరుపాల యాదమ్మ, వీరమల్ల పార్వతమ్మ పాల్గొన్నారు.