మోత్కూరు, ఆగస్టు 6 : ప్రత్యేక తెలంగాణ స్వాప్నికుడు.. తెలంగాణ సాధన కోసం తన యావత్ జీవితం తపించిన మహా మనిషి ప్రొఫెసర్ జయశంకర్ సార్ అని బీసీ హక్కుల సాధన సమితి తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధూళిపాల ధనుంజయ నాయుడు అన్నారు. బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండల కేంద్రంలో జయశంకర్ సార్ జయంతి కార్యక్రమంలో పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి మాట్లాడారు. నీళ్లు, నిధులు, నియామకాలలో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని, ఆంధ్రా వలస పాలకుల దోపిడీతో తెలంగాణ అల్లాడిపోయిందని, ఎలుగెత్తి చాటి తెలంగాణ ఏర్పాటు ఆవశ్యకతను ఊరు వాడా ప్రచారం చేసిన ధీశాలి జయశంకర్ సార్ అని కొనియాడారు.
విద్యార్థి దశలోనే ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ అని ఉద్యమాన్ని ప్రారంభించాడని, ఆ ఉద్యమంలో పాల్గొని తెలంగాణ కోసం శ్రమించాడని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమానికి బీసీ హక్కుల సాధన సమితి మోత్కూరు మండల అధ్యక్షుడు మెండే వెంకటేశ్వరరావు అధ్యక్షత వహించగా సిపిఐ మండల కార్యదర్శి అన్నెపు వెంకట్, చాపల అంజయ్య, పులుకరం మల్లేశ్, గొలుసు యాదగిరి, తాడూరి లక్ష్మీనరసయ్య, బొయిని ఉప్పలయ్య, ఏఐవైఎఫ్ రాష్ట్ర కమిటీ సభ్యుడు చిలకరాజు శ్రీను పాల్గొన్నారు.