మోటకొండూర్, జూన్ 23 : అర్హులందరికీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లను ఇవ్వాలని బీఆర్ఎస్ మోటకొండూర్ మండల ప్రధాన కార్యదర్శి ఎగ్గిడి కృష్ణ అన్నారు. స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య మండలంలో జనాభా ప్రాతిపదికన ఇండ్లను కేటాయించడం లేదని మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద సోమవారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలంలో చిన్న చిన్న గ్రామాలకు ఎక్కువ ఇండ్లను కేటాయించి, మండల కేంద్రానికి తక్కువ ఇండ్లను ఇచ్చి మండల కేంద్రాన్ని చిన్నచూపు చూస్తున్నారని ఆరోపించారు.
మండల కేంద్రంలో 200 పైచిలుకు ఇందిరమ్మ ఇండ్లను కేటాయించాలన్నారు. కాంగ్రెస్ నాయకులకు కాకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ అనంతుల జంగారెడ్డి, మాజీ కో ఆప్షన్ సభ్యుడు బురాన్, మాజీ వైస్ ఎంపీపీ బాల్ద లింగం, బీఆర్ఎస్ వై నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి జివిలికపల్లి వెంకటేశ్, నాయకులు భూమండ్ల యాదయ్య, బాలగాని లక్ష్మీనారాయణ, దడిగే మధు, పల్లపు మధు, బొట్ల ప్రశాంత్ పాల్గొన్నారు.