బీబీనగర్, మే 19 : భూసార పరిరక్షణతో అధిక దిగుబడులు సాధించవచ్చని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వ్యవసాయ పరిశోధన సంచాలకులు డాక్టర్ బలరాం అన్నారు. బీబీనగర్ మండలంలోని మాధారం గ్రామంలో మంగళవారం నిర్వహించిన “రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు” కార్యక్రమంలో ఆయన పాల్గొని రైతులకు ఆధునిక వ్యవసాయ పద్ధతులు, నాణ్యమైన విత్తన ఉత్పత్తి, భూసార పరిరక్షణ తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న విత్తన వారోత్సవాల ప్రాముఖ్యతను రైతులకు వివరించారు. రైతులు స్వయంగా నాణ్యమైన విత్తన ఉత్పత్తి చేపట్టే విధానాలు, అనుసరించాల్సిన యాజమాన్య పద్ధతులపై సూచనలు చేశారు. యూనివర్సిటీలో అందుబాటులో ఉన్న వివిధ విత్తన రకాల వివరాలను తెలియజేశారు. పంటకాలం అనంతరం పంట అవశేషాలను కాల్చివేయకుండా వాటిని సేంద్రీయ కర్భనంగా మార్చి భూసారాన్ని పెంపొందించే బయోచార్ తయారీ, వినియోగ విధానాలపై కూడా రైతులకు సమగ్రంగా అవగాహన కల్పించారు.
తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం యాదాద్రి భువనగిరి జిల్లా ప్రధాన శాస్త్రవేత్త, సమన్వయకర్త డాక్టర్ డి. శ్రీలత మాట్లాడుతూ మార్కెట్లో గిరాకీ ఉన్న పంట రకాలను మాత్రమే సాగు చేయాలని సూచించారు. విత్తన చట్టంపై అవగాహన కల్పిస్తూ మట్టి పరీక్షల ఆధారంగా యూరియా వినియోగం, నీటి సంరక్షణ, పంటల మార్పిడి, సమగ్ర పురుగు తెగుళ్ల నిర్వహణ, ఆధునిక సాగు పద్ధతులు, దిగుబడి పెంపుకు శాస్త్రీయ విధానాల అమలు వంటి అంశాలను వివరించారు. సమగ్ర చీడపీడల యాజమాన్యంపై రైతులకు అవగాహన కలిగి ఉండాలని పురుగు మందులు, తెగుళ్ల మందులు పిచికారి చేసే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. రైతులు యూరియా వినియోగాన్ని తగ్గించి సేంద్రీయ ఎరువుల వినియోగాన్ని పెంచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి పద్మ, ఏఈఓ ఉమామహేశ్వరి, గ్రామ సర్పంచ్ మందడి వెంకట్ రెడ్డి, గ్రామ రైతులు పాల్గొన్నారు.

భూసార పరిరక్షణతో అధిక దిగుబడులు : డాక్టర్ బలరాం