— రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ ఛైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు
భూదాన్ పోచంపల్లి, జనవరి 09 : చేనేత రుణమాఫీ నిధులను ప్రభుత్వం వెంటనే బ్యాంకుల్లో జమ చేయాలని తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ ఛైర్మన్ డా.వకుళాభరణం కృష్ణమోహన్ రావు డిమాండ్ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి పట్టణ కేంద్రంలో చేనేత రుణమాఫీ, చేనేత సమస్యలపై బిజెపి చేనేత సెల్ ఆధ్వర్యంలో నిర్వహించిన రిలే నిరాహార దీక్షలు శుక్రవారం రెండు రోజుకు చేరుకున్నాయి. దీక్ష శిబిరాన్ని ఆయన సందర్శించి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చేనేత వర్గాలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయకపోవడాన్ని ఆయన తీవ్రంగా విమర్శించారు. చేనేత వర్గ ప్రజలను పట్టించుకోకపోవడం పాలనలో బాధ్యతారాహిత్యానికి నిదర్శనమన్నారు. చేనేత రుణమాఫీ చేస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేస్తూ కార్మికులను మోసం చేస్తుందని దుయ్యబట్టారు.
అగ్గిపెట్టెలో ఆమర్చగలిగిన చీరలను రూపొందించే అసాధారణ నైపుణ్యం కలిగిన చేనేత కళాకారులను ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం తగదన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ వంటి మహనీయుల కృషి వల్లే ఈ స్థాయిలోనైనా పథకాలు కొనసాగుతున్నాయన్నారు. మహాత్మా గాంధీ వారసులమని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ, గాంధీజీతో అనుబంధం ఉన్న చేనేత వర్గాలను విస్మరించడం దురదృష్టకరం అన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ రాట్నం వడకడాన్ని ఫ్యాషన్‌గా మార్చి, ర్యాలీలు, ఫొటోలకే పరిమితం అవుతోందని ఆయన ఎద్దేవా చేశారు.
చేనేత భరోసా కింద రూ.24 వేలు, థ్రిఫ్ట్ నిధుల పరిస్థితి ఏమిటో ప్రభుత్వం స్పష్టంగా చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. చేనేత వస్త్రాలను ప్రభుత్వం నేరుగా కొనుగోలు చేయాలని, ఈ వర్గాలకు జీవన భరోసా కల్పించాలని కోరారు. సహకార సంఘాల ఎన్నికలను వెంటనే నిర్వహించాలన్నారు. అనంతరం దీక్షలో పాల్గొన్న ప్రతినిధులకు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర చేనేత జన సమాఖ్య అధ్యక్షుడు చింతకింది రమేశ్, జిల్లా చేనేత సెల్ అధ్యక్షుడు గంజి బసవలింగం, బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ చిక్క కృష్ణ, పట్టణ అధ్యక్షుడు డబ్బికార్ సహేష్, మాజీ అధ్యక్షుడు రచ్చ సత్యనారాయణ, నేతలు బారత బాలరాజ్, ఏలే శ్రీనివాస్, భారత భూషణ్, చెరుకూరి వెంకటేశం, గంజి సుదర్శన్, వరకాల వెంకటేశం, బి.రఘు, మేకల చొక్కారెడ్డి, చేనేత కార్మికులు పాల్గొన్నారు.