రాజాపేట, నవంబర్ 08 : తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో రాజాపేట సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో నిర్వహించిన 11వ జోనల్ స్థాయి క్రీడా పోటీల్లో వివిధ పాఠశాలల నుండి వచ్చిన క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. శనివారం ముగింపు కార్యక్రమంలో భాగంగా రాజాపేట పేట ఎస్ఐ అనిల్ కుమార్ మాట్లాడుతూ.. ఆటలో గెలుపు ఓటములు సహజం అని, విద్యార్థి దశ నుండే కష్టపడడం అలవాటు చేసుకోవాలన్నారు. వ్యక్తి జీవితంలో క్రీడలు ఎంతో ప్రభావం చూపుతాయన్నారు. శారీరక, మానసిక అభివృద్ధికి క్రీడలు ఎంతో దోహద పడుతాయన్నారు. గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ సుధాకర్ మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని ఆకాక్షించారు. గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో డీసీఓ పి.సుధాకర్, క్రీడల సమన్వయకర్త జి.శ్రీనివాస్, పీడీలు కిషన్, వెంకటేశ్వర్లు, వైస్ ప్రిన్సిపాల్ వేణు పాల్గొన్నారు.