ఆలేరు టౌన్, జూలై 17 : మహిళలు ఆర్థికంగా ఎదగడమే ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు. గురువారం ఇందిరా మహిళా శక్తి సంబరాల్లో భాగంగా ఆలేరు పట్టణంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో వై ఎస్. ఎన్ ఫంక్షన్ హాల్ నందు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, జిల్లా కలెక్టర్ హనుమంతరావు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ మాట్లాడుతూ..మహిళలు ఆర్థికంగా ఎదగడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందన్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే సీఎం రేవంత్రెడ్డి ఆలోచన అని, అందుకు ప్రతి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమంలో మహిళలకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. బస్సులో ఉచిత ప్రయాణం, మహిళల పేరు మీదనే ఇందిరమ్మ ఇండ్లు, నూతన రేషన్ కార్డులు, ఐకేపీ కేంద్రాల నిర్వహణ, మహిళా శక్తి క్యాంటీన్లు, సోలార్ పవర్ ప్లాంట్లు ఏర్పాటుతో ప్రభుత్వం మహిళలకు ఆలంభనగా ఉన్న విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.
ఎమ్మెల్సీ నెల్లకంటి సత్యం మాట్లాడుతూ.. సమాజం సమగ్ర అభివృద్ధి చెందాలంటే ముందుగా మహిళా అభివృద్ధి జరగాలన్నారు. మహిళలు అన్ని రంగాల్లో ముందుకు వెళ్తూ ఆర్థికంగా ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. జిల్లా కలెక్టర్ హనుమంతరావు మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రతి సంక్షేమ పథకంలో మహిళలను భాగస్వామ్యం చేస్తుందని తెలిపారు. పెట్రోల్ బంకులు, అద్దె బస్సులు, స్కూల్ యూనిఫామ్ స్టిచ్చింగ్, మహిళ సంఘాలకి లోన్, బీమా, ప్రమాద బీమా సౌకర్యం ప్రభుత్వం కల్పించినట్లు పేర్కొన్నారు. అనంతరం స్వయం సహాయక సంఘాల సభ్యులకు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, సెర్ప్ ఆధ్వర్యంలో చెక్కులు పంపిణీ చేశారు.
– మహిళ సంఘ సభ్యులకు వడ్డీ లేని రుణాలు : 1,44,20,489
– స్వయం సహాయక సంఘ సభ్యురాలి నామిని (కటికల కిష్టయ్య ) కు ప్రమాద బీమా రూ:10 లక్షలు
– ఆలేరు నియోజకవర్గం మహిళా సభ్యులకు బ్యాంక్ రుణాలు : రఊ.51,77,26,000
– మహిళా సంఘ సభ్యులకు లోన్ బీమా క్లెయిమ్స్ : రూ.11,53,008 విలువ గల చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారి నాగిరెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఐనాల చైతన్య మహేందర్ రెడ్డి, ప్రజా ప్రతినిధులు, మహిళలు పాల్గొన్నారు.