భూదాన్ పోచంపల్లి, జూన్ 28 : రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని రాష్ట్ర వ్యవసాయ సంక్షేమ శాఖ కమిషన్ చైర్మన్ కోదండరాంరెడ్డి అన్నారు. శనివారం భూదాన్ పోచంపల్లి వినోబా మందిరంలో భూమి సునీల్ సారధ్యంలో లీగల్ ఎంపవర్మెంట్ అండ్ అసిస్టెన్స్ ఫర్ ఫార్మర్స్ సొసైటీ ( లీప్స్ ) ఆధ్వర్యంలో రైతులకు చట్టాలపై అవగాహన కల్పించేందుకు సాగు న్యాయ యాత్ర కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతుల హక్కులు, సాగు చట్టాలపై అవగాహన కల్పించేందుకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 28 నుండి అక్టోబర్ 2 వరకు 800 పైచిలుకు గ్రామాల మీదుగా 2,400 కిలోమీటర్ల పర్యటన సాగుతుందని తెలిపారు . నాణ్యత లేని విత్తనాలు, ఎరువులు, పురుగుల మందుల వల్ల రైతులకు నష్టం వాటిల్లుతుందని మార్కెట్లో జరిగిన మోసాలకు పంటల బీమా అందనప్పుడు చట్టాలతో రైతులకు అవసరం ఏర్పడుతుందని, చట్టాలను వినియోగించుకుని ఆర్థికంగా ఎదుగాలని సూచించారు.
దేశంలో 60 శాతం మందికి పైగా జీవనాధారం వ్యవసాయమని, రైతులకు సేవలందిస్తే సాగు రక్షించబడుతుందని తెలిపారు. రైతులకు చట్టాలను చుట్టాలు చేయడమే లక్ష్యంగా సాగు న్యాయ యాత్ర చేపట్టినట్లు వెల్లడించారు. విత్తనాలు కొన్నప్పుడు రసీదు తప్పక తీసుకోవాలని, నాణ్యమైన విత్తనం రైతు హక్కు అని, నాణ్యత లేని విత్తనాలతో నష్టం జరిగితే పరిహారం పొందవచ్చునని తెలిపారు. విత్తనాల కొనుగోలుకు చెల్లించిన ధర, సాగుకైన ఖర్చు తగ్గిన, దిగుబడి విలువ కలిగిన మానసిక క్షోభకు పరిహారం పొందవచ్చునని పేర్కొన్నారు. పోచంపల్లిలో జువ్వి చెట్టు కింద కరపత్రాన్ని ఆవిష్కరించారు. రైతులకు ఉచితంగా సేవలందిస్తున్న లీప్ సంస్థకు మండల నాయకుడు గోరంటి శ్రీనివాస్ రెడ్డికి రూ.50 వేలు ఇవ్వనున్నట్లు ప్రకటించారు.
ఈ కార్యక్రమంలో రైతు సంక్షేమ కమిషన్ మెంబర్ కె వి ఎన్ రెడ్డి, లీప్ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు, భూభారతి సభ్యుడు భూమి సునీల్, భూదాన యజ్ఞ బోర్డ్ మాజీ చైర్మన్ గున్న రాజేందర్ రెడ్డి , లీప్ సంస్థ ఉపాధ్యక్షుడు జీవన్ రెడ్డి, జాయింట్ సెక్రెటరీ అభిలాష్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పాక మల్లేశ్ యాదవ్, డిసిసి ఉపాధ్యక్షుడు కళ్లెం రాఘవరెడ్డి, జిల్లా నాయకుడు సామ మధుసూదన్ రెడ్డి, పిఎసిఎస్ వైస్ చైర్మన్ సామ మోహన్ రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు సుర్వి వెంకటేశ్, మద్ది అంజిరెడ్డి, నాయకులు గోరంటి శ్రీనివాస్ రెడ్డి, కొట్టం కరుణాకర్ రెడ్డి, తోట శ్రీనివాస్, పడాల సతీష్ చారి, మహేశ్, ఏలే భిక్షపతి, కొయ్యడ నరసింహ, వేషాల మురళి, అంజమ్మ, రైతులు పాల్గొన్నారు.