– ఈ నెల 20న పాత గుట్ట చౌరస్తా వద్ద బీఆర్ఎస్ ఆధ్వర్యంలో భారీ రాస్తారోకో, ధర్నా
యాదగిరిగుట్ట, నవంబర్ 18 : పాత గుట్ట రోడ్డు విస్తరణలో భాగంగా ఇల్లు, స్థలాలు కోల్పోతున్న బాధితులను ప్రభుత్వం తక్షణమే తగిన విధంగా ఆదుకోవాలని, లేకపోతే బీఆర్ఎస్ యాదగిరిగుట్ట పట్టణ శాఖ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఉద్యమం చేపడతామని ఆ పార్టీ పట్టణ సెక్రటరీ జనరల్ పాపట్ల నరహరి హెచ్చరించారు. మంగళవారం యాదగిరిగుట్ట పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఆయన పాతగుట్ట రోడ్డు బాధితులు, బీఆర్ఎస్ నాయకులతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో పాతగుట్ట రోడ్డు విస్తరణకు గాను రోడ్డుకు ఇరువైపులా 20 ఫీట్ల చొప్పున 40 ఫీట్ల మేరకు విస్తరణ చేయాలని నిర్ణయించగా, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రోడ్డుకు ఇరువైపులా 25 ఫీట్ల చొప్పున మొత్తం 50 ఫీట్ల మేరకు విస్తరణ చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. అయితే రోడ్డు విస్తరణలో భాగంగా దుకాణాలు, ఇండ్లు, స్థలాలు కోల్పోతున్న బాధితులకు ప్రభుత్వం తగిన విధంగా ఆదుకోవాలన్నారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం యాదగిరిగుట్ట ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా ఇల్లు కోల్పోయిన వారికి ఇల్లు, స్థలాలు కోల్పోయిన వారికి స్థలాలు, దుకాణాలు కోల్పోయిన వారికి దుకాణాలు ఇచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. అదే రకంగా పాత గుట్ట రోడ్డు విస్తరణలో భాగంగా ఇల్లు కోల్పోయిన వారికి ఇండ్లు, దుకాణాలు కోల్పోయిన వారికి దుకాణాలు, స్థలాలు కోల్పోయిన వారికి స్థలాలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. నష్ట పరిహారంతో పాటు వీటన్నింటిని ప్రభుత్వం తక్షణమే ఇవ్వాలన్నారు. లేకపోతే పాత గుట్ట రోడ్డు బాధితుల తరఫున తాము పెద్ద ఎత్తున ఉద్యమం నిర్వహిస్తామని తెలిపారు. పాతగుట్ట రోడ్డు బాధితులకు న్యాయం జరిగే వరకూ తమ ఉద్యమాన్ని కొనసాగిస్తామన్నారు.
పాత గుట్ట రోడ్డు బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ ఈ నెల 20న పాత గుట్ట చౌరస్తా వద్ద బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పాత గుట్ట రోడ్డు బాధితులతో కలిసి పెద్ద ఎత్తున రాస్తారోకో, ధర్నా నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ పట్టణ కార్యదర్శులు ఆరె శ్రీధర్ గౌడ్, దేవపూజ అశోక్, సీనియర్ నాయకులు పెరబోయిన సత్యనారాయణ, దండబోయిన వీరేశ్ యాదవ్, బబ్బురి వెంకటేశ్ గౌడ్, కంసాని స్వామి, వాసం రమేశ్, గాదపాక క్రాంతి, బుడుగే సత్తయ్య గౌడ్, పాతగుట్ట రోడ్డు బాధితులు కంసాని రేవతి, కంసాని లక్ష్మి, కంసాని కాళీ, కంసాని శేఖర్, కంసాని అరవింద్, కంసాని మూర్తి పాల్గొన్నారు.