యాదగిరిగుట్ట, ఏప్రిల్ 09 : హస్తకళలను ప్రోత్సహించేందుకే స్వామివారి క్షేత్రంలో ”గోల్కొండ హస్తకళా విక్రయశాల” ను అందుబాటులోకి తీసుకు వచ్చిన్నట్లు రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యశాఖ ముఖ్యకార్యదర్శి, రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరక్టర్ శైలజా రామయ్యర్ తెలిపారు. రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల్లో గల హస్తకళలను ప్రదర్శించి స్వామివారిని దర్శించుకునే భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలన్నదే తమ లక్ష్యమని చెప్పారు. బుధవారం యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామివారి దేవస్థానం కొండపైన రాష్ట్ర హస్తకళా అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గోల్కొండ హస్తకళల విక్రయశాలను రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ చైర్మన్ నాయుడు సత్యనారాయణతో కలిసి ఆమె ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. స్వామివారిని దర్శించుకునే భక్తులు హస్తకళలతో రూపొందించిన వస్తువులను కొనుగోలు చేసి ఉపాధి కల్పనకు కృషి చేయాలని కోరారు. పెంబర్తి హస్తకళలు, ఉడ్ కార్వింగ్ తో రూపొందించిన బొమ్మలు, ఇతర హస్తకళ చిత్రాలు అందుబాటులోకి తీసువచ్చినట్లు తెలిపారు. కొండపైన హస్తకళ విక్రయశాలను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. ఇందుకు సహకరించిన దేవాలయ అధికారులు, హస్తకళల అభివృద్ధి సంస్థ ప్రతినిధులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో హస్తకళల అభివృద్ధి సంస్థ ఓఎస్డీ భాష, మసూద అలీ, వేణుగోపాల్, గాయత్రి, సుల్తానా, శ్రీపాణి, మహేందర్ రావు, ఆలయ ఈఓ భాస్కర్రావు, డీఈఓ దోర్బల భాస్కరశర్మ పాల్గొన్నారు.