వలిగొండ, నవంబర్13: మండలంలోని వెంకటాపురంలో మత్స్యగిరి లక్ష్మీ నరసింహ స్వామి వార్షిక బ్రహోత్సవాల్లో భాగంగా స్వామి వారి కల్యాణ మహోత్సవాన్ని బుధవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. మాఢవీధుల్లో ఉత్సవ మూర్తులను ఊరేగింపుగా కల్యాణ వేదిక వద్దకు తీసుకొచ్చి రంగురంగుల పూలతో అలంకరించారు. వేదమంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ అమ్మవారి మెడలో స్వామివారు మంగళసూత్రధారణ చేసే ఘట్టాన్ని నయనానందకరంగా నిర్వహించారు. స్వామి వారి కల్యాణ మహోత్సవానికి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి దంపతులు పట్టువస్ర్తాలు, ముత్యాల తలంబ్రాలు అందజేసి కల్యాణ వేడుకలో పాల్గొన్నారు.
కల్యాణం అనంతరం భక్తులకు జంపాల రాంబాబు అన్నదానం చేశారు. కార్యక్రమంలో మాజీ రాజ్యసభ సభ్యుడు రాపోలు ఆనంద భాస్కర్, ధర్మకర్తల మండలి చైర్మన్ కొమ్మారెడ్డి నరేశ్‌రెడ్డి, ఈఓ సల్వాద్రి మోహన్‌బాబు, ధర్మకర్తలు కొడితాల కరుణాకర్, అరూరు వెంకటేశం, రేఖల ప్రభాకర్, మైసోళ్ల అంజయ్య, బండి రవికుమార్, గుండు జగన్మోహన్రెడ్డి, అంబాల ఊషయ్య, ఈతాప రాములు, జక్కల కేతమ్మ, మైసోళ్ల వెంకటేశం, కొమిరే బాలేశ్వర్, కందుల శ్రీను, గజ్జల అమరేందర్, అర్చకులు, సిబ్బంది, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
స్వామి వారి కల్యాణ తంతులో సంప్రదాయాలను విస్మరించడంపై ఈఓను నిలదీసిన భక్తులు మత్స్యగిరి లక్ష్మీ నరసింహస్వామి కల్యాణ మహోత్సవంలో పాల్గొని మొక్కును చెల్లించుకోవడానికి వెయ్యి రూపాయలు పెట్టి టికెట్ కొనుగోలు చేసిన భక్తులు అధికారులు, అర్చకుల తీరుతో విస్మయం వ్యక్తం చేశారు. స్వామి వారి కల్యాణ సయమంలో నిర్వహించే సంప్రదాయాల తంతు సందర్భంగా దంపతులు కంకణాల మార్పిడి, భార్యాభర్తలు ఒకరికొకరు కుంకుమ తిలకధారణలను భక్తులతో చేయించలేదు. స్వామి వారి కాళ్లు కడిగి కన్యాదానం చేయడానికి కూర్చున్న దంపతులను పూర్తిగా విస్మరించి కల్యాణ తంతు నిర్వహించారు. కల్యాణ మూర్తులను మాఢవీధుల్లో ఊరేగిస్తూ కల్యాణ వేదికవద్దకు తీసుకొచ్చారేగాని ఎదుర్కోళ్ల ఘట్టాన్ని విస్మరించినట్లు కనిపించింది. ఈ మేరకు స్వామి వారి కల్యాణ మహోత్సవంలో కల్యాణం టికెట్లు కొన్న భక్తులు ఈఓ మోహన్‌బాబును నిలదీశారు. సామాన్య భక్తులకు తమకు ఏమి తేడా లేదని అడిగారు.