మోటకొండూర్, జనవరి 31 : యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూర్ మండలంలోని దిలావర్పూర్ గ్రామానికి చెందిన గీత కార్మికుడు సీసా పండరి గౌడ్ వృత్తి నిర్వహణలో ఉండగా ప్రమాదవశాత్తు తాటి చెట్టుపై నుండి కిందపడి మృతి చెందాడు. కుటుంబానికి ఆయనే ఆధారంగా ఉండటంతో వారి దయనీయ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని సహాయం అందించాలని కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బొలగాని జయరాములు కౌండిన్య అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (KANA) సంస్థను కోరారు. దీంతో KANA సంస్థ మృతుడి కుటుంబానికి రూ.20,000 ఆర్థిక సహాయం ప్రకటించగా సంస్థ స్థానిక ప్రతినిధి నాతి గణేష్ సూచన మేరకు ఈ మొత్తాన్ని పండరి గౌడ్ కుటుంబానికి జయరాములు స్వయంగా అందజేశారు. ఈ సందర్భంగా జయరాములు మాట్లాడుతూ..
జిల్లాలో ఇటీవల గీత కార్మికుల ప్రమాదాలు పెరుగుతున్నాయని, ప్రభుత్వాలు స్పందించి ప్రతి గీత కార్మికుడికి సేఫ్టీ పరికరాలు అందించడంతో పాటు వృత్తి రక్షణ చర్యలు చేపట్టాలన్నారు. మృతుడి కుటుంబానికి సహాయం అందించిన KANA సంస్థకు సంఘం జిల్లా కమిటీ, గ్రామ గౌడ సొసైటీ తరఫున కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు, గ్రామ మాజీ సర్పంచ్ సీస బాలరాజు గౌడ్, జిల్లా నాయకులు దూడల కొమురయ్య గౌడ్, స్థానిక సొసైటీ అధ్యక్షులు సీస సత్యనారాయణ, ఉపాధ్యక్షుడు బబ్బురు గణేష్, మాజీ సొసైటీ అధ్యక్షులు సీస సత్తయ్య, సీస యాదయ్య, సీసా యాదగిరి, బబ్బూరి వెంకయ్య, బబ్బూరి మైసయ్య, సీస ప్రవీణ్, సీసా మహేందర్, సీస రాజు, పంతంగి అంజయ్య పాల్గొన్నారు.