మోత్కూరు, జులై 10 : మోత్కూరు మండల తాసీల్దార్ కార్యాలయ అధికారుల అలసత్వానికి విసిగి ఇద్దరు రైతులు గురువారం తాసీల్దార్ కార్యాలయం ఎదుట ఆత్మహత్యాయత్నం చేశారు. మండలంలోని అనాజిపురం గ్రామానికి చెందిన రైతులు తండ్రీకొడుకులు కుమ్మరికుంట్ల శేఖర్‌రెడ్డి, హనిష్రెడ్డి పురుగుల మందు డబ్బా, పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశారు. గ్రామంలోని సర్వే నంబర్ 97/5/1లో ఏడు ఎకరాల భూమి ఉంది. సాగు కోసం తన భూమిలో బోరు వేసుకుని సాగు చేసుకుంటుండగా, అదే గ్రామానికి చెందిన మరో రైతు బండ మల్లయ్య తన భూమికి 40 మీటర్ల దూరంలోనే బోరు వేసుకున్నాడని, దీంతో తన బోరు బావి ఎండి పోయే ప్రమాదం ఉందని అతడిపై చర్యలు తీసుకుని వాల్టా నిబంధనల ప్రకారం బోరును సీజ్ చేయాలని గడిచిన ఏప్రిల్ 24న కార్యాలయంలో అధికారులకు ఫిర్యాదు చేశారు.
కాగా ఇప్పటి వరకు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదంటూ గురువారం తాసీల్దార్ కార్యాలయానికి తండ్రికొడుకులు చేరుకుని పెట్రోలు పోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించారు. అక్కడే ఉన్న వారు అడ్డుకుని వారించడంతో ప్రమాదం తప్పింది. అధికారుల చుట్టూ రోజు తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని వారు ఆరోపించారు. బోరు ఎండిపోతే తమకు చావే దిక్కన్నారు. ఇప్పటికైనా అధికారులు పరిశీలించి తమకు న్యాయం చేయాలని కోరారు. వాల్టా నిబంధనల ప్రకారం ఉన్నతాధికారుల అదేశాల మేరకు శుక్రవారం బండ మల్లయ్య వేసుకున్న బోరును సీజ్ చేయనున్నట్లు తాసీల్దార్ జ్యోతి హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు.