బీబీనగర్, మే 12 : రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యం కొనుగోలు విషయంలో ప్రభుత్వం, ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా విఫలమైందని భువనగరి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం బీబీనగర్ మండలంలోని మగ్గంపల్లి, పెద్ద పలుగు తండా, చిన్న రావులపల్లి, బ్రాహ్మణపల్లి గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించిన ఆయన రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రాల్లో నెల రోజులుగా ధాన్యం రాశులు అలాగే ఉండిపోవడం, లారీలు రాకపోవడం, మిల్లర్లు ధాన్యం ఎత్తకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. రైతుల పక్షాన నిలవాల్సిన అధికారులు మిల్లర్లతో కుమ్మక్కై వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. వర్షాల భయంతో రైతులు ఆందోళన చెందుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శించారు. కొనుగోలు కేంద్రాల్లో ఎ గ్రేడ్ గా ధృవీకరించిన ధాన్యాన్ని మిల్లర్లు బీ గ్రేడ్‌గా చూపిస్తూ ధరలు తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నారని రైతులు తమకు వాపోయినట్లు పేర్కొన్నారు.
ధాన్యం తడిస్తే కట్ చేయాలనే ఉద్దేశంతోనే ఎత్తివేత ఆలస్యం చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. కొనుగోలు కేంద్రాల్లో వడ్లు పేరుకుపోయినా లారీలు ఎందుకు రావడం లేదో, మిల్లర్లు ఎందుకు ధాన్యం ఎత్తడం లేదో అధికారులు సమీక్షించడం లేదన్నారు. రైతు పంటను అమ్ముకునే సమయంలోనే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, సమస్యల పరిష్కారంలో యంత్రాంగం పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవానికి వచ్చిన ప్రజాప్రతినిధులు రైతుల సమస్యలపై మాత్రం స్పందించడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ఫోన్లు చేసినా స్పందించడం లేదని, కొనుగోలు కేంద్రాల పరిస్థితిని పరిశీలించేందుకు కూడా రావడం లేదని రైతులు ఆరోపిస్తున్నారని పేర్కొన్నారు. మూడు రోజుల్లో సమస్యలను పరిష్కరించి ధాన్యం ఎత్తివేయకపోతే మండల కేంద్రాల్లోని ఎమ్మార్వో కార్యాలయాల ఎదుట భారీ ధర్నాలు నిర్వహిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
మిల్లుల వద్ద గత 10 రోజులుగా లారీలు వేచి ఉన్నా ధాన్యాన్ని దిగుమతి చేసుకోవట్లేదని, కటింగుల పేరుతో రైతులను నిలువు దోచేస్తున్నారని అన్నారు. ఏ గ్రేడ్‌ను బీ గ్రేడ్‌గా మార్చడమే కాకుండా ప్రతి బస్తాకు 42 కిలోలే తూకం వేసి మిగిలిన ధాన్యాన్ని కటింగుల పేరుతో రైతులను మోసంచేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ యర్కల సుధాకర్ గౌడ్, రైతు బంధు సమితి మండల మాజీ కోఆర్డినేటర్ బొక్క జైపాల్ రెడ్డి, ఆర్యవైశ్య మహాసభ జిల్లా అధ్యక్షుడు మల్లగారి శ్రీనివాస్, బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రాచమల్ల శ్రీనివాసులు, ప్రధాన కార్యదర్శి చింతల సుదర్శన్ రెడ్డి, బిఆర్ఎస్ రాష్ర్ట నాయకురాలు గాదె కవిత నరేందర్ రెడ్డి, నయకులు పిట్టల అశోక్, అమృతం శివకుమార్, పంజాల సతీష్ గౌడ్, కొంతం లింగెయ్యగౌడ్, ఎర శేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.

రైతు పండిస్తే.. లాభం మిల్లర్లకేనా? : మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి