భూదాన్ పోచంపల్లి, జూన్ 08 : ధాన్యం కొనుగోలు, దిగుమతి ప్రక్రియలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని యాదాద్రి భువనగిరి జిల్లా అడిషనల్ కలెక్టర్ వెంకారెడ్డి అన్నారు. సోమవారం భూదాన్ పోచంపల్లి మండలం ఇంద్రియాల గ్రామంలోని కన్యకా పరమేశ్వరి రైస్ మిల్లును ఆయన సందర్శించారు. మిల్లులో ఎంత ధాన్యం ఉంది ధాన్యం పెట్టడానికి అనువైన స్థలం ఉందా తరుగు పేరిట రైతులకు ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా వంటి విషయాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జిల్లాలో 4.50 లక్షల టన్నుల ధాన్యం సేకరించాలని లక్ష్యం కాగా, ఇప్పటివరకు 3.80 లక్షల ధాన్యం సేకరించినట్లు తెలిపారు. వారం రోజుల్లో ధాన్యo కొనుగోలు కేంద్రాలను పూర్తి చేస్తామని తెలిపారు.
జిల్లాలో 351 కొనుగోలు కేంద్రాలకు గాను 50% ధాన్యం కొనుగోలు కేంద్రాలు పూర్తి చేసినట్లు తెలిపారు. తరుగు పేరుతో రైతులను ఇబ్బంది పెట్టకూడదని, కొనుగోలు కేంద్ర నిర్వాహకులకు, మిల్లర్లకు సూచించారు. ప్రభుత్వ నిబంధనలు మేరకే నామ్స్ ప్రకారం ధాన్యం కొనుగోలు చేయడం జరుగుతుందని, రైతులు ఎవరు ఆందోళన పడవలసిన అవసరం లేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా సివిల్ సప్లై అధికారిని రోజా రమణి, మండల తాసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి, డీటీ బాలమణి, ఎం.ఆర్.ఐ గుత్తా వెంకటరెడ్డి, శివారెడ్డిగూడెం గ్రామ సర్పంచ్ బొక్క మల్లారెడ్డి, నాయకులు వారాల రామచంద్రారెడ్డి, రైస్ మిల్ యజమాని విజయేందర్ రెడ్డి, పలువురు రైతులు పాల్గొన్నారు.

రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలి : అడిషనల్ కలెక్టర్ వెంకారెడ్డి