– లక్ష్మీపురంలో జాతీయ ప్రకృతి వ్యవసాయ మిషన్పై అవగాహన సదస్సు
ఎర్రుపాలెం, ఆగస్ట్ 18 : ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండల పరిధిలోని లక్ష్మీపురం గ్రామంలో జాతీయ ప్రకృతి వ్యవసాయ మిషన్ (ఎన్ఎంఎన్ఎఫ్) పథకంపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. జిల్లా వ్యవసాయ అధికారి కార్యాలయం, ఖమ్మం ఏడీఏ-టెక్నికల్ పోల వాసవి రాణి, మధిర ఏడీఏ ఇమ్మడి వాణిశ్రీ రైతులకు ప్రకృతి వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. రసాయన ఎరువులు, పురుగుమందుల వినియోగాన్ని క్రమంగా తగ్గించి, స్థానికంగా లభించే సహజ వనరులతో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడమే జాతీయ ప్రకృతి వ్యవసాయ మిషన్ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ప్రకృతి వ్యవసాయంలో భాగంగా జీవామృతం, ఘన జీవామృతం, వివిధ రకాల కషాయాలు వంటి సహజ ఇన్పుట్లను వినియోగించడం ద్వారా నేల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని పేర్కొన్నారు.
ప్రకృతి వ్యవసాయ పద్ధతులతో నేలలో సేంద్రీయ పదార్థం పెరిగి, భూసారం మెరుగుపడడంతో పాటు నీటి వినియోగ సామర్థ్యం పెరుగుతుందని వివరించారు. నేలలో సూక్ష్మజీవుల కార్యకలాపాలు, జీవ వైవిధ్యం పెంపొందడంతో పర్యావరణ పరిరక్షణకు కూడా దోహద పడుతుందని చెప్పారు. రసాయన ఎరువులు, పురుగుమందులపై ఆధారపడటం తగ్గించడం ద్వారా సాగు ఖర్చులు తగ్గించుకుని రైతులు ఆదాయాన్ని మెరుగుపరుచుకునే అవకాశం ఉందన్నారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా సురక్షితమైన, నాణ్యమైన ఆహార ఉత్పత్తితో పాటు దీర్ఘకాలంలో వ్యవసాయాన్ని మరింత స్థిరంగా కొనసాగించేందుకు అవకాశం ఉంటుందని రైతులకు వివరించారు. స్థానిక వనరులను సద్వినియోగం చేసుకుంటూ ప్రకృతి వ్యవసాయ పద్ధతులను ఆచరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ తల్లపురెడ్డి నాగిరెడ్డి, ఏఈఓలు కత్తి కృష్ణకుమారి, ఏడుకొండలు, బాలకృష్ణ, పలువురు రైతులు పాల్గొన్నారు.