యాదగిరిగుట్ట, జూన్ 17 : విద్యా వ్యాపారాన్ని అరికట్టాలని, యాదగిరిగుట్ట మండలంలోని ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఫీజలను తగ్గించడంతో పాటు గుర్తింపు లేని పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని అఖిల భారత యువజన సమైక్య జిల్లా కార్యదర్శి పేరబోయిన మహేందర్ డిమాండ్ చేశారు. మంగళవారం పట్టణంలో మండల విద్యాధికారి శరత్ యామినిని కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రైవేట్ విద్యాసంస్థలు, నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ విద్యార్థులకు రూ.20 వేల ఫీజులు వసూళ్లు చేయడం దారుణమన్నారు.
విద్యా సంస్థల్లో పాఠ్య పుస్తకాలు విక్రయించకూడదని నిబంధన ఉన్నా, పట్టించుకోకుండా పాఠ్య పుస్తకాలు, యూనిఫాం, ఐడీ కార్డులు ఇతర సామగ్రిని అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత యువజన సమైక్య మండల కార్యదర్శి కంబాల వెంకటేశ్, నాయకులు అనంతుల నరసింహ, పాకలపాటి రాజు, రావుల శ్రీను, సంగి అరవింద్, కంబాల రాజు పాల్గొన్నారు.