భువనగిరి అర్బన్, జూన్ 16 : గృహ కార్మికుల పట్ల యజమానులు గౌరవంగా వ్యవహరించాలని సిడిపిఓ శైలజ అన్నారు. అంతర్జాతీయ గృహ కార్మికుల దినోత్సవం సందర్భంగా యాక్షన్ ఎయిడ్ ఆధ్వర్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. పని ప్రదేశంలో వేధింపులు లేని సమాజ నిర్మాణానికి అందరం కృషి చేయాలన్నారు. గృహ కార్మికులలో మహిళలు, పేదలు ఎక్కువ సంఖ్యలో ఉంటారని వీరికి సంక్షేమం, వైద్య సదుపాయాలు అవసరమని తెలిపారు. అసంఘటిత రంగంలో పని చేస్తున్న వారు ఈ శ్రమ్ పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న వివిధ ఇన్సూరెన్స్ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ రాజు సూచించారు. వివిధ పాలసీల గూర్చి కార్మికులకు వివరించారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన శివలింగం మాట్లాడుతూ గృహ కార్మికుల కోసం సమగ్ర చట్టం తీసుకురావాలని, ఇందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే ఈఎస్ఐ సదుపాయం కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్నర్ వీల్ క్లబ్ అధ్యకురాలు లావణ్య, ఎలార్పీ ప్రతినిధులు జె.కవిత, టి.చంద్రకళ, జి.శోభారాణి, టి.శిరీష, అనూష, భాస్కర్ నాయక్ పాల్గొన్నారు.