యాదగిరగుట్ట, మార్చి 25 : ఏదైనా వ్యాపారం చేయాలంటే కేంద్ర, రాష్ట్రాలకు కట్టే జీఎస్టీ ట్యాక్స్ పాటు ఆలేరు నియోజకవర్గంలో బీర్ల అయిలయ్య (బీఐ) ట్యాక్స్ చెల్లించాల్సిదేనా అని బీఆర్ఎస్ పార్టీ యాదగిరిగుట్ట మండలాధ్యక్షుడు కర్రె వెంకటయ్య అన్నారు. అధికారంలోకి వచ్చి 15 నెలల కాలంలో ఒకవైపు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య భూదందాలకు తెరతీస్తే.. ఆయన అనుచరులు, యాదగిరిగుట్ట మున్సిపల్ కౌన్సిలర్లు ముక్యర్ల మల్లేశ్ యాదవ్, గుండ్లపల్లి భరత్ గౌడ్ వ్యాపారుల నుంచి అక్రమంగా వసూళ్లు చేస్తూ నయా దందాకు పాల్పడుతున్నారని ఆరోపించారు. మంగళవారం బీఆర్ఎస్ కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు. హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యాపారి పట్టణంలో పెట్రోల్ బంక్‌ను ఏర్పాటు చేస్తే ముక్యర్ల మల్లేశ్‌యాదవ్, గుండ్లపల్లి భరత్ గౌడ్ రూ.5 లక్షలు ఇవ్వాల్సిందినేని డిమాండ్ చేసిన ఫోన్ రికార్డు బయటపడిందన్నారు.
ప్రజా పాలన పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇలా వసూళ్లకు పాల్పడుతూ వ్యాపారాలు నడుపుకునే వారిని తీవ్రంగా ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు తెలిపారు. ప్రజాపాలనా మార్పు అంటే ఇదేనా అని ప్రశ్నించారు. వ్యాపారస్తులు, సామాన్య రైతులపై పడి దోచుకుతినడమేనా అన్నారు. పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన హోటళ్ల యజమానులను సైతం తమకు ట్యాక్స్ చెల్లించాల్సిందేనని, లేకపోతే హోటళ్లను ఏలా నడుపుతారో చూస్తామంటూ బెదిరింపులకు పాల్పడుతున్నట్లు చెప్పారు. బీర్ల అయిలయ్య ట్యాక్స్ బాధితుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందన్నారు. అంతేకాకుండా యాదగిరిగుట్ట, జంగంపల్లి, ఆలేరు మండలంలోని కొలనుపాక, రాజాపేట మండలంలోని రఘునాధపురంలో సామాన్య రైతుల భూములను కబ్జా చేస్తున్నారని ఆరోపించారు. భూ సమస్యలుంటే తమవద్దకు రావాలని ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య బాహటంగానే ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. పలు వివాదాల్లో ఎమ్మెల్యే తలదూర్చి సెటిల్మెంట్లకు పాల్పడుతుంటే మరోవైపు ఆయన అనుచరులు గుట్టలో కొబ్బరికాయ దుకాణాల నుంచి హోటళ్లు, పెట్రోల్ బంకులపై పడి దోచుకు తింటున్నారని దుయ్యబట్టారు. ఇదేంటని ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెట్టి భయబ్రాంతులకు గురిచేస్తున్నట్లు తెలిపారు.
పట్టణ ప్రధాన రహదారికి ఇరువైపులా రోడ్లను కబ్జా చేసి ఒక్కొక్కరి వద్ద రూ. 50 వేల నుంచి లక్ష వరకు వసూళ్లు చేసి అక్రమంగా షెడ్లను ఏర్పాటు చేశారన్నారు. పోలీస్ స్టేషన్లను పూర్తిగా సెటిల్మెంట్లకు అడ్డాగా మార్చారన్నారు. భార్యభర్తల పంచాయతీల్లో తలదూర్చి రూ.1.50 లక్షలు వసూళ్లు చేసిన ఘటనలు సాక్ష్యాదారులతో బయటపెడతామన్నారు. వర్షాలు లేక, సాగు నీళ్లందక, నాణ్యమైన విద్యుత్ సరఫరా కాకుండా పంటలు ఎండి రైతులు ఏడుస్తుంటే కనీసం ఆటువైపు చూడని ఆలేరు ఎమ్మెల్యే పైసా వసూళ్లకు పాల్పడుతూ వ్యాపారస్తులను తీవ్ర ఇబ్బందులు గురిచేస్తున్నట్లు తెలిపారు. గుట్టలో వ్యాపారం చేయాలంటేనే భయపడుతున్నారన్నారు. సామాన్య ప్రజల నుంచి రూ.5 కోట్లు వసూళ్లు చేసి ఉడాయించిన రాజస్థాన్‌కు చెందిన మార్వాడి వ్యాపారికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉన్నట్లు ప్రజలు చర్చించుకుంటున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సిల ఏర్పాటులో మార్వాడి వ్యాపారస్తుడు డబ్బులు ఇచ్చింది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు.
ఇక్కడ పెట్టుబడి పెట్టేందుకు ఎవరూ ముందుకు రావడం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తమకు మంచి జరుగుతుందని ప్రజలు నమ్మి ఓట్లేస్తే ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య, ఆయన అనుచరులు మాత్రం గ్రామాలపై పడి దొపిడీకి పాల్పడటం ప్రజలు గమనిస్తున్నాన్నారు. త్వరలో ప్రజాక్షేత్రంలో బీర్ల అయిలయ్య, ఆయన ఆనుచరుల తీరును ఎండగడతామన్నారు. ఎమ్మెల్యే చేస్తున్న అన్యాయాలను ఊరురా తిరిగి ప్రచారం చేసి దోషిగా నిలబెట్టేవరకు ఊరుకోమన్నారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ ఇమ్మడి రామిరెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గడ్డమీది రవీందర్, టోన్ సెక్రటరి జనరల్ పాపట్ల నరహరి, నాయకులు సయ్యద్ బాబా, గడ్డం చంద్రం, పీరబోయిన సత్యనారాయణ, కొన్యాల నరసింహారెడ్డి, శరాజీ రాజేశ్, కన్న రాజు, చిరంజీవి, మానుపటి వెంకటేశ్, గౌడ శ్రీశైలం పాల్గొన్నారు.