సంస్థాన్ నారాయణపురం, మే 27 : సర్పంచుల పెండింగ్ బిల్లుల సమస్యను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని మాజీ సర్పంచుల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదయ్య గౌడ్ అన్నారు. బిల్లుల చెల్లింపు కోరుతూ మంగళవారం ప్రజావాణి కార్యక్రమంలో వినపత్రం అందజేసే కార్యక్రమం నిర్వహించాలని పిలుపునివ్వగా పోలీసులు ఆయనను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా సుర్వి యాదయ్య గౌడ్ మాట్లాడుతూ.. పోలీసులు సర్పంచుల ఇండ్ల దగ్గర కాపువాసి అరెస్టు చేయడం దురదృష్టకరం అన్నారు. కాంగ్రెస్ పాలనలో ప్రభుత్వానికి వినతి పత్రాలు అందజేయడం కూడా ఒక పాపం అయిందని, రాష్ట్రంలో నియంత పాలన నడుస్తుందన్నారు.
ఎంతోమంది సర్పంచులు అభివృద్ధి పనులు చేసి గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్ది అప్పుల బాధతో ఆత్మహత్యలు చేసుకుని మరణిస్తుంటే ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేదన్నారు. ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు రూ.153 కోట్లు విడుదల చేస్తున్నామని చెప్పినా సర్పంచులకు పెండింగ్ బిల్లులు అందలేదన్నారు. కేవలం కాంట్రాక్టర్లకు SDF బిల్లులు విడుదల చేసి అవి సర్పంచుల పెండింగ్ బిల్లులు విడుదల చేశామని చెప్పుకోవడం అన్యాయం అన్నారు. ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీల్లో తీర్మానాలు ఎంబీ రికార్డ్ చేసి ఏఈ, డీఈతో రికార్డ్ చేయించి చెక్ మేజర్ చేయించి ఉన్న వాటిని వెంటనే స్టేట్ ఫైనాన్స్ ఎస్ఎఫ్సీ నిధులు విడుదల చేయాలని కోరారు. పంచాయతీ రాజ్ మంత్రి సీతక్క పెండింగ్ బిల్లులపై సమీక్ష నిర్వహించి సమస్యను పరిష్కరించాలని పేర్కొన్నారు.