రాజాపేట, ఏప్రిల్ 14 : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులోని వైయస్సార్ గార్డెన్లో ఈ నెల 24న జరిగే రాష్ట్ర పాడి రైతుల సదస్సును జయప్రదం చేయాలని పాడి రైతుల సంఘం రాష్ట్ర కన్వీనర్ మంగ నర్సింహులు, తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మాటూరి బాలరాజ్ గౌడ్, జిల్లా ఉపాధ్యక్షుడు కోమటిరెడ్డి చంద్రారెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం రాజాపేట, రఘునాథపురం, బొందుగుల గ్రామాల్లో సదస్సుకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించి మాట్లాడారు.
రైతులు వ్యవసాయంతో పాటు రెండో ప్రధాన ఆధారంగా పాల ఉత్పత్తి చేసి జీవనోపాధి పొందుతున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు పాడి రైతులకు ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టలేదన్నారు. రైతులకు ఇవ్వాల్సిన పెండింగ్ బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. లీటరుకు రూ.5 ప్రోత్సాహకాన్ని వెంటనే రైతుల ఖాతాలో జమ చేయాలన్నారు. పాడి రైతుల సమస్యలను సదస్సులో చర్చించి కార్యక్రమాన్ని రూపొందించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజాపేట సొసైటీ చైర్మన్ సందిల భాస్కర్, పాడి రైతులు పాల్గొన్నారు.