సంస్థాన్ నారాయణపురం, ఏప్రిల్ 22 : యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం పుట్టపాక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో కాన్వోకేషన్ డే ను మంగళవారం ఘనంగా నిర్వహించారు. అలాగే గురుకుల ప్రవేశ పరీక్షలో ప్రతిభచూపి సీట్లు సాధించిన 21 మంది విద్యార్థులకు అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన పాఠశాల హెచ్ఎం ఎన్.సి. యల్లయ్య మాట్లాడుతూ.. పుట్టపాక పాఠశాలను ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా తీర్చిదిద్దేందుకు విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తుల సహకారంతో కృషి చేసినట్టు చెప్పారు. గత ఏడాది గురుకుల ఎంట్రన్స్ లో పుట్టపాక పాఠశాల నుంచి 31 మంది విద్యార్థులు సీట్లు సాధించగా, ఈ ఏడాది 21 మంది విద్యార్థులు సీట్లు సాధించినట్లు తెలిపారు. మరికొంతమంది విద్యార్థుల పేర్లు వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్నట్లు చెప్పారు. పాఠశాల అభివృద్ధికి తొడ్పాటు అందిస్తున్న ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా ఆయన ధన్యవాదాలు తెలిపారు.
మరో అతిథి, పాఠశాల పూర్వ విద్యార్థి, ఎంఎన్ఆర్ ట్రస్ట్ ప్రతినిధి మర్రి మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలే ఉచిత, నాణ్యమైన విద్యను, సరైన జీవన నైపుణ్యాలను విద్యార్థులకు అందిస్తున్నాయన్నారు. అందుకు పుట్టపాక ప్రాథమిక పాఠశాలనే నిదర్శనమని తెలిపారు. ప్రైవేట్ పాఠశాలల మాదిరిగా ప్రభుత్వ పాఠశాలలోనూ కాన్వోకేషన్ కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమన్నారు. ఇక్కడి నుంచి ప్రతి ఏటా పెద్ద సంఖ్యలో విద్యార్థులు గురుకుల పాఠశాలలకు అర్హత సాధించడం గ్రామానికి గర్వకారణం అన్నారు. పాఠశాలలో నాణ్యమైన విద్య అందించేందుకు తనతోపాటు గ్రామస్తుల సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని చెప్పారు.
గురుకులం సీట్లు సాధించిన విద్యార్థులు భవిష్యత్‌లోనూ ఉన్నతంగా ఎదిగి పాఠశాలతో పాటు పుట్టిన ఊరు పుట్టపాకకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. పాఠశాలను జిల్లాలోనే ప్రత్యేకంగా నిలబెడుతున్న ఉపాధ్యాయ బృందానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. అనంతరం విద్యార్థులకందరికి మెమెంటోలు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు విమల, హేమలత, పద్మావతి, ఏ.శ్రీనివాస్, సునీత, ఏఏపీసీ చైర్పర్సన్ జి.కృష్ణవేణి, రజిని, గ్రామ పెద్దలు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.