హైదరాబాద్, ఫిబ్రవరి 17 (నమస్తే తెలంగాణ) : ఇంజినీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే టీజీ ఎప్‌సెట్ దరఖాస్తుల స్వీకరణ గురువారం నుంచి ప్రారంభంకానున్నది. ఉదయం 11:30 గంటల నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తారు. ఇప్పటికే ఎప్‌సెట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈసారి సెంటర్ల కేటాయింపులో అమ్మాయిలకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్టు అధికారులు పేర్కొన్నారు. ఎప్‌సెట్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభంకానున్న నేపథ్యంలో మంగళవారం కూకట్‌పల్లిలోని జేఎన్టీయూలో అధికారులు ప్రెస్‌మీట్ నిర్వహించారు.
ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వీ బాలకిష్టారెడ్డి, జేఎన్టీయూ వీసీ ప్రొఫెసర్ టీ కిషన్‌కుమార్‌రెడ్డి, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వెంకటేశ్వర్రావు, ఎప్‌సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ విజయ్‌కుమార్‌రెడ్డి పలు వివరాలను మీడియాకు వెల్లడించారు. మహిళా అభ్యర్థులు దరఖాస్తులో పేర్కొన్న అడ్రస్‌కు సమీపంలో ఉన్న సెంటర్లనే కేటాయిస్తామని తెలిపారు. ఆఖరులో దరఖాస్తు చేస్తే సమీప సెంటర్లు పడే వీలుందన్నారు. దరఖాస్తుల్లో దొర్లిన తప్పులను సవరించుకునేందుకు ఏప్రిల్ 6 నుంచి 8 వరకు ఎడిట్ ఆప్షన్ అందుబాటులో ఉంటుందని వెల్లడించారు. ఏప్రిల్ 23న హాల్‌టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. సమావేశంలో ఉన్నత విద్యామండలి వైస్చైర్మన్లు ప్రొఫెసర్ ఎస్కే మహమూద్, ప్రొఫెసర్ ఇటికాల పురుషోత్తం, కార్యదర్శి ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేశ్, ఎప్‌సెట్ కో కన్వీనర్ ప్రొఫెసర్ బాలునాయక్ తదితరులు పాల్గొన్నారు.