సిటీబ్యూరో, ఫిబ్రవరి 17(నమస్తే తెలంగాణ): ఆధ్యాత్మికతకు నెలవైన దేవాలయాలు నేడు సోషల్‌మీడియా పిచ్చికి అడ్డాగా మారుతున్నాయి. మహాశివరాత్రి పర్వదినం వేళ శంషాబాద్‌లోని ధర్మగిరి దేవాలయంలో కొందరు యువకులు చేసిన పని ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. భక్తులంతా భక్తిశ్రద్ధలతో కొబ్బరికాయలు, పూలు సమర్పిస్తుంటే ఈ ప్రబుద్ధులు మాత్రం సాక్షాత్తు ఈ పరమశివుడికి గంజాయిని ప్రసాదంగా పెట్టి తమ వికృత చేష్టలను ప్రదర్శించారు. బడంగ్‌పేటకు చెందిన చరణ్, అతని స్నేహితులు శివరాత్రి సందర్భంగా ధర్మగిరి ఆలయానికి వచ్చారు. అందరూ చేసేలా తాము ఏదో వెరైటీగా చేస్తున్నామనే భ్రమలో గంజాయిని దేవుడి పాదాల చెంత ఉంచి వీడియో తీశారు. దేవుడికి అందరూ కొబ్బరికాయలు కొడతారు.. మేము మాత్రం గంజాయి ప్రసాదం పెడుతున్నాం అంటూ ఆ వీడియోలో వ్యాఖ్యానించారు. అనంతరం ఆ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్‌గా పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది.
శివునికి గంజాయి ప్రసాదం వీడియోపై నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దేవుడిని, భక్తుల మనోభావాలను కించపరిచేలా వ్యవహరించిన సదరు యువకులపై చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సజ్జనార్‌కు సోషల్‌మీడియా వేదికగా ఫిర్యాదు చేశారు. దీనిపై తక్షణమే స్పందించిన సీపీ సజ్జనార్.. నిందితులను గుర్తించి కఠిన చర్యలు తీసకోవాలని పోలీసు సిబ్బందిని ఆదేశించారు. వీడియో ఆధారంగా బడంగ్‌పేటకు చెందినవారుగా పోలీసులు గుర్తించి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా సీపీ సజ్జనార్ మాట్లాడుతూ.. కేవలం వ్యూస్‌కోసం, లైక్స్ కోసం మతపరమైన విశ్వాసాలను దెబ్బతీస్తూ ఇలాంటి రీల్స్ చేసేవారిని వదిలే ప్రసక్తేలేదని హెచ్చరించారు. సోషల్‌మీడియాను విజ్ఞానానికి ,వినోదానికి ఉపయోగించాలి తప్ప ఇలాంటి వికృత చేష్టలకు కాదు… పవిత్రమైన దేవాలయాల్లో ఇలాంటి పనులకు పాల్పడితే కఠినమైన చట్టపరమైన చర్యలు తప్పవని ఆయన స్పష్టం చేశారు.
దేవుడి ముందు మాదకద్రవ్యాలను చూపిస్తూ రీల్సా? ఫేమస్ అవ్వడం కోసం ఎంతకైనా తెగిస్తారా?
మహాశివరాత్రి భక్తికి నిదర్శనం.. ముక్తికి సోపానం. పరమ పవిత్రమైన ఈ పర్వదినాన, దైవ ప్రసాదం పేరుతో మత్తు పదార్థాలను ప్రదర్శించడం అత్యంత హేయమైన చర్య. అది వికృతమైన ఉన్మాదం!
మేమేదో సాహసం చేశామని… pic.twitter.com/MWeFz2Id19
— V.C. Sajjanar, IPS (@SajjanarVC) February 17, 2026