మోత్కూరు, జూలై 23 : మోత్కూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న దాడి కేసులో దోషి కాసర్ల జానయ్యకు రామన్నపేట కోర్టు సీనియర్ సివిల్ జడ్జి ఐదేళ్ల జైలు శిక్షతో పాటు రూ.10 వేల జరిమానా విధిస్తూ బుధవారం తీర్పు వెలువరించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మోత్కూర్ పోలీస్ స్టేషన్లో 2020లో పొడిచేడు గ్రామానికి చెందిన కాసర్ల జానయ్య గొడ్డలితో తనపై దాడి చేశాడని కాసర్ల అంజయ్య ఫిర్యాదు చేశాడు. ఇద్దరి పొలాల మధ్య గెట్టు వివాదం కారణంగా ఈ ఘర్షణ చోటు చేసుకుంది. గ్రామ పెద్దల సమక్షంలో పలుమార్లు సమస్య పరిష్కారం చేసేందుకు ప్రయత్నించినప్పటికీ, విభేదాలు కొనసాగాయి. చివరికి ఓరోజు కాసర్ల జానయ్య కాపుకాసి కాసర్ల అంజయ్యపై గొడ్డలితో దాడి చేసి గాయపరిచాడు.
ఫిర్యాదు మేరకు అప్పటి ఎస్ఐ హరిప్రసాద్ కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకుని రిమాండ్ చేశారు. విచారణలో కోర్టులో సాక్ష్యాలు, వాంగ్మూలాలు సమర్పించగా, న్యాయవాదుల వాదనలు విన్న రామన్నపేట కోర్టు సీనియర్ సివిల్ జడ్జి కాసర్ల జానయ్యను దోషిగా తేల్చారు. దీంతో ఐదేళ్ల జైలు శిక్షతో పాటు రూ.10 వేల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు. దీంతో కాసర్ల జానయ్యను నల్లగొండ జిల్లా జైలుకు తరలించినట్లు మోత్కూర్ ఇన్స్పెక్టర్ సి.వెంకటేశ్వర్లు తెలిపారు.