రాజాపేట, నవంబర్ 19 : రాజాపేట మండలంలోని దూది వెంకటాపురంలో రూ.4 కోట్లతో ఏర్పాటు చేస్తున్న విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణ పనులను బుధవారం ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదలకు ఉచిత కరెంట్ అందించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కిందన్నారు. దూది వెంకటాపురం పరిధిలోని వ్యవసాయ రంగానికి లో ఓల్టేజీ సమస్య పరిష్కారం కోసం విద్యుత్ సబ్ స్టేషన్ ను మంజూరు చేసినట్టు తెలిపారు. అనంతరం రాజాపేటలో స్వర్గీయ ఇందిరాగాంధీ జయంతి పురస్కరించుకుని ఆమె విగ్రహానికి పూలమాలు వేసి నివాళులర్పించారు. ఇందిరమ్మ భారతదేశాన్ని ప్రపంచ పటంలో నిలిపిన ఉక్కు మనిషి అని కొనియాడారు. ఆమె ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు నమిల, మహేందర్ గౌడ్, బుడిగ పెంటయ్య గౌడ్, కరాటే బాలు, ఇంజ నరేశ్, ఐరేని నవీన్ కుమార్ పాల్గొన్నారు.