గీత కార్మికుల సంక్షేమం, వారి బతుకుల్లో వెలుగులు నింపాలనే ఉద్దేశంతో బీఆర్ఎస్ ప్రభుత్వం రూ. 7కోట్లతో నీరా కేంద్రాన్ని నందనం గ్రామం నిర్మించింది. అప్పటి ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ నీరా కేంద్రం ఏర్పాటుకు ప్రత్యేక చొరవ చూపారు. కల్లును ప్రాసెసింగ్ చేయడానికి కావాల్సిన యంత్ర సామగ్రిని ఏర్పాటు చేసింది.బీఆర్ఎస్ హయాంలోనే పనులన్నీ పూర్తయ్యాయి. ఎన్నికల కోడ్ కారణంగా ప్రారంభానికి అడ్డుకట్టపడింది. దీంతో గీత కార్మికుల ఆశయం నెరవేరలేదు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నీరా కేంద్రాన్ని పట్టించుకోవడంలేదు. ప్రారంభించడానికి కాలయాపన చేస్తున్నది. గీత కార్మికుల జీవన ప్రమాణాలను దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్నది. తక్షణమే నీరా కేంద్రాన్ని ప్రారంభించాలని గీత కార్మికులు డిమాండ్ చేస్తున్నారు.
భువనగిరి కలెక్టరేట్, జూన్ 14: బీఆర్ఎస్ ప్రభు త్వ హయాంలో నందనం గ్రామంలో నీరా తాటి, ఈత ఉత్పత్తుల కేంద్రాన్ని నిర్మించింది. అందుకు అవసరమైన యంత్ర సామగ్రినీ తెప్పించారు. ఈ నీరా కేంద్రం ఏర్పాటుతో యాదాద్రిభువనగిరి జిల్లా కేంద్రంలోని పలు మండలాలకు చెందిన వేలాది మంది గీత కార్మికులు, వారి కుటుంబాలకు, యువతకు మెరుగైన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని భావించారు. నీరా కేంద్రంలో తాటి, ఈత కల్లును ప్రాసెసింగ్ చేసి దేశ విదేశాలకు ఎగుమతులు చేపడుతారు. అంతేకాకుండా తాటి బెల్లం, చక్కరలతో పాటు చాక్లెట్లు, తాటి ఆకులతో గృహోపకరణాలు, ఆట వస్తువులను తయారు చేసి మార్కెట్లో విక్రయిస్తారు.
ఆరోగ్య ప్రదాయిని నీరా…
ప్రస్తుతం మార్కెట్లో దొరికే అన్ని పానీయాలతో పోలిస్తే నీరా ఎంతో శ్రేష్టమైనది. అమృత ప్రదాయినిగా ప్రజలు భావిస్తారు. గీత కార్మికుల ఆధ్వర్యంలో సేకరించే స్వచ్ఛమైన తాటి, ఈత కల్లును సూర్యోదయానికి ముందే సేకరించి నీరా కేంద్రానికి తరలించి అక్కడ ఉన్న మిషనరీల ద్వారా ప్రాసెసింగ్ చేసి ఎలాంటి కల్తీకి ఆస్కారాలు లేకుండా స్వచ్ఛమైన నీరాను ప్రత్యేకంగా తయారుచేసి విక్రయాలు చేపడుతారు. నీరాకు మన దేశంతో పాటుగా ఇతర దేశా ల్లో ఎంతో డిమాండ్ ఉన్నది. అంతటి ప్రాధాన్యత కలిగిన నీరా ఉత్పత్తి కేంద్రాన్ని ప్రభుత్వం వెంటనే ప్రారంభించాలని స్థానికులు కోరుతున్నారు.
పాడవుతున్న సామగ్రి…
బీఆర్ఎస్ ప్రభుత్వం గీత కార్మికుల సంక్షేమం, ఆర్థ్దిక ఎదుగుదలను కాంక్షించి ఏర్పాటు చేసిన నీరా కేంద్రంలో కోట్ల రూపాయలతో నీరా ప్రాసెసింగ్ యూనిట్‌కు సంబంధించిన యంత్రాలను సమకూర్చింది. అప్పట్లో అనివార్య కారణాలతో ప్రారంభానికి నోచుకోని నీరా ప్రాసెసింగ్ యూనిట్‌కు కాం గ్రెస్ పాలనలో గ్రహణం పట్టింది. కేంద్రంలోని మిషనరీ పాడయ్యే పరిస్థితులు నెలకొన్నారు.
తక్షణమే ప్రారంభించాలి
నందనంలో గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన నీరా ప్రాజెక్టును వెంటనే ప్రారంభించాలి. రూ. 7కోట్లతో నిర్మాణ పనులు పూర్తిస్థాయిలో జరిగినా ఇప్పటికీ ప్రారంభించకపోవడం దురదృష్టకరం. కల్లుగీత కార్మిక సంఘం పోరాట ఫలితంగా గతంలో నందనంలో నీరా ప్రాజెక్టు ఏర్పాటు చేసింది. గీత కార్మిక కుటుంబాల్లో వెలుగులు నింపే బృహత్తర పథకం ఇది.
– జయరాములు
ఉపాధి అవకాశాలు మెరుగు
నీరా కేంద్రం ఏర్పాటుతో ఉద్యోగ, ఉపా ధి అవకాశాలు మెరుగుపడుతాయి. గీత కార్మికుల సంక్షేమాన్ని ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే నీరా కేంద్రం ఏర్పాటు చర్యలు చేపట్టింది. గీత కార్మిక కుటుంబాలకు ఆర్థ్ధికంగా ఉపయుక్తంగా ఉన్న నీరా కేంద్రాన్ని అన్ని హంగులతో ప్రారంభించి ఉపయోగంలోకి తీసుకురావాలి.
– లక్ష్మీనారాయణ గౌడ్