యాదాద్రి భువనగిరి, అక్టోబర్ 28 : అధికార దుర్వినియోగం చేస్తూ అక్రమాలకు పాల్పడుతున్న ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ యాదగిరిగుట్ట మండల అధ్యక్షుడు కర్ర వెంకటయ్య డిమాండ్ చేశారు. మంగళవారం యాదగిరిగుట్ట పోలీస్ స్టేషన్లో పట్టణ సీఐ భాస్కర్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీర్ల ఐలయ్యపై వస్తున్న ఆరోపణలను దృష్టి మల్చేందుకే ఎంపీ చామల, ఎమ్మెల్యే బీర్ల గత సోమవారం మాజీ మంత్రి హరీశ్ రావుపై ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఎమ్మెల్యే స్వగ్రామమైన సైదాపురం మాసాయిపేట గివెన్ పరిధిలోని సర్వే నంబర్ 726లో సుమారు 15 ఎకరాల భూమిని రైతులను మోసం చేసి స్పెక్ట్రా వెంచర్‌కు విక్రయించారన్నారు. సదరు వెంచర్‌ను అభివృద్ధి చేస్తామని చెప్పి ఫ్లాట్లు విక్రయించి కస్టమర్లను మోసం చేశాడన్నారు. వెంచర్లో ఎలాంటి డెవలప్మెంట్ చేయకుండా ఉండటంతో కస్టమర్లకు ప్లాట్లు ఎక్కడున్నాయో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. ఎమ్మెల్యే చేసిన మోసంతో కష్టమర్లకు ప్లాటు దొరకడం లేదని దీనిపై విచారణ చేపట్టాలని కోరారు.
రాజపేట మండలంలోని చల్లూరు గ్రామంలో సర్వే నంబర్ 322లో 600 ఎకరాల సీలింగ్ భూమిని ఎలాంటి డాక్యుమెంట్ లేకుండా అక్రమంగా తన పేరున క్రమబద్ధీకరించుకున్నాడని పోలీసుల దృష్టికి ఆయన తీసుకెళ్లారు. ఇటీవల కాలంలో ఎమ్మెల్యేగా ఎన్నికైన అనంతరం సుమారు రూ.200 కోట్ల విలువ చేసే 100 ఎకరాల భూములను అక్రమార్గంలో సంపాదించాడని తుర్కపల్లికి చెందిన వ్యక్తి ఏసీబీ ఐటీ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశాడని, దీనిపై సమగ్రంగా విచారించాలన్నారు. బొమ్మలరామారం మండలంలోని రంగాపూర్ గ్రామ రెవెన్యూ పరిధిలోని సుమారు 20 ఎకరాల భూమి వివాదం ఉండగా సెటిల్మెంట్ చేసి తీసుకున్నట్లుగా ఆరోపణలు ఉన్న విషయాన్నిఈ సందర్భంగా గుర్తు చేశారు.
రాజపేట మండలంలోని చల్లూరు గ్రామంలో ఎలాంటి పరిపాలనా అనుమతులు, గ్రామ పంచాయతీ తీర్మానం లేకుండానే క్రషర్ నిర్మాణం చేపట్టారని గ్రామ ప్రజలు ఆరోపిస్తున్నారన్నారు. హైదరాబాద్‌లోని ఉప్పల్ చెరువు కట్ట వద్ద ఎకరం భూమి, నాగోల్ లోని రూ.13 కోట్ల భవనం, బంజారాహిల్స్ లోని రూ.13 కోట్ల విల్లాస్ తదితర స్థిరాస్తులు ఎలా కొనుగోలు చేశారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పి ఎస్ సి ఎస్ చైర్మన్ ఇమ్మడి రామ్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు మిట్ట వెంకటయ్య, కసావు శ్రీనివాస్, పట్టణ సెక్రెటరీ జనరల్ పాపట్ల నరహరి, పేరు పాయింట్ సత్యనారాయణ, కొన్యాల నరసింహారెడ్డి, అశోక్ పాల్గొన్నారు.