బీబీనగర్, సెప్టెంబర్ 04 : కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల విఫల పాలనకు నిరసనగా బీఆర్ఎస్, విద్యార్థి కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం బీబీనగర్‌లోని పోచంపల్లి రాస్తాలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఎన్నికల ముందు నిరుద్యోగులు, యువతకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి చింతల సుదర్శన్ రెడ్డి, బీఆర్ఎస్వీ యాదాద్రి భువనగిరి జిల్లా ప్రధాన కార్యదర్శి జక్కి నగేశ్ మాట్లాడుతూ.. యూత్ డిక్లరేషన్, జాబ్ క్యాలెండర్, 420 హామీల పేరుతో ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ యువతను మోసం చేసిందని ఆరోపించారు. ప్రభుత్వం ఏర్పడి దాదాపు 34 నెలలు గడుస్తున్నా నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు అమలుకు నోచుకోవడం లేదని విమర్శించారు. ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయకపోవడంతో నిరుద్యోగ యువత ఆశలు అడియాశలయ్యాయని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు.
జీవో నంబర్ 7 పేరుతో ప్రభుత్వం తీసుకొస్తున్న విధానాలు పేద, మధ్యతరగతి విద్యార్థులను ఉన్నత విద్యకు దూరం చేసేలా ఉన్నాయని విమర్శించారు. విద్యార్థుల అకౌంట్లలో ఫీజు రీయింబర్స్ మెంట్ మొత్తాలను జమ చేస్తామని చెబుతూ వారిపై అదనపు భారం మోపుతున్నారని ఆరోపించారు. దీంతో పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ర్టంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 34 నెలలు గడుస్తున్నా గ్రామాలు, మున్సిపాలిటీల అభివృద్ధికి ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని ఆరోపించారు. కేసీఆర్ హయాంలో డంపింగ్ యార్డులు, పల్లె-పట్టణ ప్రగతి, ప్రకృతి వనాలు, క్రీడా ప్రాంగణాలు, సీసీ రోడ్లు, అండర్ డ్రైనేజీలు తదితర అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని గుర్తు చేశారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం కళ్లు తెరిచి యువతకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, నిరుద్యోగులను మోసం చేసిన తీరును సరిదిద్దుకోవాలని డిమాండ్ చేశారు.
యువతను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీని ప్రజలు నిలదీయాల్సిన అవసరం ఉందన్నారు. యువజన విద్యార్థి కమిటీ ఆధ్వర్యంలో శనివారం(నేడు) భువనగిరిలో భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు. మండలంలోని వివిధ గ్రామాల నుంచి యువత, విద్యార్థులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ర్యాలీని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌లు కొమురె శ్రీకాంత్, కొలను వాణి కృష్ణారెడ్డి, బీఆర్ఎస్ పట్టణ ప్రధాన కార్యదర్శి దేవరకొండ శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ టంటం భార్గవ్, నాయకులు దొంతిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, బానోత్ నరేందర్ నాయక్, బీఆర్ఎస్వీ నియోజికవర్గ ఉపాధ్యక్షుడు మున్నా, షేక్ హుస్సేన్, లోకదాసు ఉప్పలయ్య, దొంతిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, డబ్బీకార్ రాజేశ్వర్, ధరావత్ రమేష్ నాయక్, బండి మధు గౌడ్, మట్ట గోపి గౌడ్, టంటం గణేష్, జక్కి నరసింహ పాల్గొన్నారు.