ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన దేశానికే రోల్‌మోడల్
ప్రధాని వ్యాఖ్యలపై నల్లజెండాలతో నిరసన తెలుపండి
12న సీఎం సభను విజయవంతం చేయాలి
విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి
టీఆర్ఎస్ శ్రేణులకు పిలుపు
భువనగిరి అర్బన్/బీబీనగర్, ఫిబ్రవరి 8 : ‘రాజ్యసభలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడిన మాటల వెనుక పెద్ద కుట్ర దాగి ఉంది. తెలంగాణ అంశమే ప్రస్తావనకు రానప్పుడు పనిగట్టుకుని తెలంగాణపై ప్రధాని చేసిన వ్యాఖ్యలు ముమ్మాటికీ ఉద్దేశపూర్వకమైనవే. సీఎం కేసీఆర్ అమలుచేస్తున్న పథకాలు తమ దగ్గరెందుకు పెట్టడం లేదని గుజరాత్, యూపీ ఎన్నికల్లో అక్కడి ప్రజలు నిలదీస్తారనే భయంతో వణికిపోతున్న మోదీ తెలంగాణపై విషం చిమ్మారు’ అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి మండిపడ్డారు. ప్రధాని వ్యాఖ్యలను తెలంగాణ సమాజం ముక్త కంఠంతో ఖండించాలని, టీఆర్ఎస్ శ్రేణులు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా నల్లజెండాలతో నిరసన తెలుపాలని పిలుపునిచ్చారు. ఈ నెల 12న భువనగిరి కొత్త కలెక్టరేట్, టీఆర్ఎస్ జిల్లా కార్యాలయం ప్రారంభోత్సవానికి సీఎం కేసీఆర్ రానున్న నేపథ్యంలో మంత్రి మంగళవారం కలెక్టరేట్, బహిరంగ సభాస్థలి పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్‌లో టీఆర్ఎస్ శ్రేణులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మంత్రి వెంట టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్‌రెడ్డి, చిరుమర్తి, రవీంద్రకుమార్, భాస్కర్‌రావు, సైదిరెడ్డి ఉన్నారు.
పేదల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధ్ది, సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేకనే బీజేపీ నాయకులు రాష్ట్ర ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్వర్‌రెడ్డి అన్నారు. భువనగిరి పట్టణంలో ఈ నెల 12న కలెక్టరేట్ కార్యాలయం, టీఆర్ఎస్ జిల్లా కార్యాలయం ప్రారంభోత్సవానికి సీఎం కేసీఆర్ రాస్తున్న నేపథ్యంలో భువనగిరితోపాటు బీబీనగర్ పట్టణంలో టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్‌రెడ్డి, శానంపూడి సైదిరెడ్డి, నల్లమోతు భాస్కర్‌రావు, రమావత్ రవీంద్రకుమార్, చిరుమర్తి లింగయ్య, నోముల భగత్‌తో కలిసి కార్యకర్తల విస్తృతస్థ్ధాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు.. తరువాత అని ప్రజలు చెప్పుకునే స్థాయిలో రాష్ట్రంలో అభివృద్ధి జరిగిందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుబంధు, రైతు బీమా, ఆసరా పింఛన్, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు దేశానికే ఆదర్శమని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం వస్తే కరెంటు, నీళ్లు ఉండవని ఆగమైతదని అన్నోళ్లకు జరిగిన అభివృద్ధిని చూసి మాటలు రావడం లేదని ఎద్దేవా చేశారు . గుజరాత్‌ను 30 ఏండ్ల పాలించిన బీజేపీ ప్రభుత్వం అక్కడ రైతులకు ఉచిత కరెంటు ఇవ్వకలేక పోయిందని అన్నారు. అనంతరం ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి మాట్లాడుతూ.. ఐటీ పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ సహకారంతో బీబీనగర్ పట్టణాన్ని 7.5 కోట్ల నిధులతో అభివృద్ధి చేశామని, మండల వ్యాప్తంగా ఇప్పటికే 80 శాతం అభివృద్ధి పనులు పూర్తి చేశామని గుర్తు చేశారు. పల్లె ప్రకృతి వనాలు, శ్మశానవాటికలు, సీసీరోడ్డుతో గ్రామాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని అన్నారు. 60 ఏండ్లుగా సీమాంధ్ర పాలనలో వెనకబడిన తెలంగాణ ప్రాంతాన్ని సీఎం కేసీఆర్ ఎనిమిదేండ్లలో అభివృద్ధి చేసి చూపారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై ఎవరెన్ని మాట్లాడినా ప్రజలు నమ్మే స్థితిలో లేరని అన్నారు. ఈ నెల 12న జరుగనున్న సీఎం కేసీఆర్ సభను విజయంతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను తిప్పికొట్టాలంటే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు సూచించారు.
ఎంపీపీ సుధాకర్‌గౌడ్, జడ్పీటీసీ గోలి ప్రణీతాపింగళ్‌రెడ్డి, వైస్ ఎంపీపీ వాకిటి గణేశ్‌రెడ్డి, సర్పంచ్ మల్లగారి భాగ్యలక్ష్మీశ్రీనివాస్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఆల్వ మోహన్‌రెడ్డి, రైతుబంధు సమితి మండల కో-ఆర్డినేటర్ బొక్క జైపాల్‌రెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రాచమల్ల శ్రీనివాస్, కార్యదర్శి చింతల సుదర్శన్‌రెడ్డి, కార్యకర్తలు, ఉద్యమకారులు పాల్గొన్నారు.
సీఎం సభ విజయవంతానికి సమష్టిగా కృషి చేయాలి : ఎమ్మెల్యే శేఖర్‌రెడ్డి
సీఎం కేసీఆర్ సభను విజయవంతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి సూచించారు. ప్రతి వార్డు నుంచి 500 మందికి తగ్గుకుండా 20వేల మందిని సభకు తరలించేలా ఏర్పాట్లు చేయాలన్నారు. సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిని చూసి ప్రజలు టీఆర్ఎస్ వెన్నంటే ఉంటారని పేర్కొన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రజలు కలలుగన్న విధంగా సీఎం కేసీఆర్ సారథ్యంలో రాష్ర్టాభివృద్ధి జరిగిందని అన్నారు. సమావేశంలో భాస్కర్‌రావు, రవీంద్రకుమార్, చిరుమర్తి లింగయ్య, సైదిరెడ్డి, యాదాద్రి టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ జడల అమరేందర్‌గౌడ్, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు కొలుపుల అమరేందర్, ఏఎంసీ చైర్మన్ నల్లమాస రమేశ్‌గౌడ్, పీఏసీఎస్ చైర్మన్ నోముల పరమేశ్వర్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ ఎన్నబోయిన ఆంజనేయులు, వైస్‌చైర్మన్ చింతల కిష్టయ్య, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు కిరణ్‌కుమార్, ప్రధాన కార్యదర్శి రచ్చ శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు చందుపట్ల వెంకటేశ్వర్రావు, నాగారం అంజయ్య, రాజేశ్వర్‌రావు, శెట్టి బాలయ్య, గోమారి సుధాకర్‌రెడ్డి, బాషబోయిన రాజేశ్, చెన్న స్వాతీమహేశ్, గాదె శ్రీనివాస్, అబ్బగాని వెంకట్, సిద్ధ్దుల పద్మ, రత్నపురం పద్మ, టీఆర్ఎస్ పట్టణ కమిటీ, అనుబంధ కమిటీల సభ్యులు మహిళా సంఘాల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.