ఆలేరు టౌన్, ఆగస్టు 28 : ఆలేరు నియోజకవర్గంలోని వాగులపై చెక్ డ్యామ్లు నిర్మించాలని సీపీఐ (ఎం.ఎల్) న్యూడెమోక్రసీ యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి ఆర్.జనార్ధన్, డివిజన్ కార్యదర్శి ఇక్కిరి సహదేవ్ అన్నారు. గురువారం వారు స్పందిస్తూ.. వర్షాకాలంలో వాగులు పొంగిపొర్లడంతో వాగులపై చెక్ డ్యామ్లు లేకపోవడం వల్ల పలు గ్రామాల ప్రజలు అనేక అవస్ధలు పడుతున్నట్లు తెలిపారు. వాగులు దాటుతున్న సమయంలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాగే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ప్రజలు ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యేపై ఆగ్రహం వ్యక్తం చేయక తప్పదని హెచ్చరించారు.
భారీ వర్షాల వల్ల జిల్లాలో అనేక చోట్ల వాగులు పొంగిపొర్లుతున్న పరిస్థితులలో ప్రజలు, రైతులు, వ్యవసాయ కూలీలు ఇతర ప్రాంతాలకు వెళ్లాలన్నా, వ్యవసాయ పనులు చేసుకోవాలన్నా, పశువులు, జీవాలను మేపేందుకు తోలుకెళ్లాలన్నా తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు చెప్పారు. జిల్లాలో భువనగిరి- రామన్నపేట, భువనగిరి నుంచి జగదేవ్పూర్, భువనగిరి నుంచి నందనం, నాగిరెడ్డిపల్లి, ఆలేరు నుంచి కొలనుపాక, రఘునాథపురం నుంచి రాజపేట, జిల్లాలో ఇంకా అనేక ప్రాంతాలలో చెక్ డ్యామ్లు లేకపోవడం వల్ల ప్రజలు, ప్రయాణికుల రాకపోకలు స్తంభించిపోయినట్లు తెలిపారు. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల ప్రాణ, ఆస్తి నష్టం ఏమైనా జరిగితే వెంటనే సహాయక చర్యలను చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని వారు డిమాండ్ చేశారు.