– ఉద్యోగ నియామకాల్లో అక్రమాలపై చర్యలు తీసుకోవాలి
– స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి
బీబీనగర్, ఆగస్టు 25 : నిమ్స్ ఇచ్చింది ఎయిమ్స్ ఏర్పాటు అయ్యింది బీఆర్ఎస్ పాలనలోనే అని ఆ పార్టీ నాయకులు అన్నారు. సోమవారం ఎయిమ్స్ ఆస్పత్రిలో స్థానికులకు ఉద్యోగాలు కల్పించాలని, ఉద్యోగ నియామకాల్లో జరుగుతున్న అవకతవకలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ బీబీనగర్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు గోలి సంతోష్ రెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి ఎయిమ్స్ ఎదుట నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్బంగా బీఆర్ఎస్ మాజీ మండల అధ్యక్షుడు పిట్టల ఆశోక్, ఆర్యవైశ్య మహాసభ జిల్లా అధ్యక్షుడు మాల్లాగారి శ్రీనివాస్ మాట్లాడుతూ.. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కృషితో ఎయిమ్స్ ఆస్పత్రి ఏర్పాటు చేసుకున్నామని, స్థానికులకు ఉద్యోగాలు రాకపోవడం బాధాకరమన్నారు. ఉద్యోగ నియామకాల్లో కాంట్రాక్ట్ ఏజెన్సీలు అవినీతికి పాల్పడుతున్నట్టు ఆరోపణలు వస్తున్నాయని, ప్రభుత్వం వారిపై చర్యలు తీసుకోవాలన్నారు.
ఎయిమ్స్ ఏర్పాటు కోసం భూములు త్యాగాలు చేసి, గాలి, నీటి కాలుష్యాన్ని భరిస్తున్న బీబీనగర్ వాసులకు ఉద్యోగ అవకాశాలు దక్కాల్సిన అవసరం ఉందన్నారు. కాంట్రాక్టర్లు ఇతర ప్రాంతాల వారికి ఉద్యోగాలు అమ్ముకుంటున్నారని విమర్శించారు. ఎయిమ్స్ ఆస్పత్రికి సంబంధించిన అధికారులు స్పందించి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరారు. అనంతరం బీఆర్ఎస్ నాయకులు ఎయిమ్స్ అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు అమృతం శివ కుమార్, గుంటిపల్లి లక్ష్మీనారాయణ, దేవరుప్పల పృధ్వీరాజ్, పంజాల మహేశ్ గౌడ్, దేవరకొండ శ్రీనివాస్, పేరబోయిన నరేశ్, వంగరి పరాకుశం, ఎండి మిట్టు, జానీ, పొట్ట శ్రీనివాస్, రాజు, గొరుకంటి శివ కుమార్, బింగి చంద్రశేఖర్, వేముల శ్రీకాంత్, రాంపల్లి కుమార్, కట్ట నరేశ్, రామ్ కుమార్ శర్మ, జాడ సంతోశ్ పాల్గొన్నారు.
Bibinagar : బీబీనగర్ ఎయిమ్స్ ఎదుట బీఆర్ఎస్ నాయకుల ధర్నా