బీబీనగర్, మార్చి 27 : ఎన్నికల ముందు బీబీనగర్ చెరువుని పర్యాటక కేంద్రంగా తీర్చి దిద్దుతానని, చెరువులో కలుస్తున్నటువంటి డ్రైనేజీ మురుగు కాల్వను దారి మళ్లించే కార్యక్రమం చేపడతానని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి రెండేళ్ల కాలం కావస్తున్నా, ఇచ్చిన హామీల అమలులో భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనీల్‌రెడ్డి పూర్తిగా విఫలమయ్యారని బీఆర్ఎస్ పార్టీ మండల మాజీ అధ్యక్షుడు పిట్టల అశోక్ అన్నారు. ఎమ్మెల్యే తీరును నిరసిస్తూ గురువారం బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు గోలి సంతోశ్‌రెడ్డి అధ్యక్షతన చెరువులో కలుస్తున్న మురుగు కాల్వను పరిశీలించి పాదయాత్రగా గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో ఉన్న గాందీ విగ్రహం ఎదుట నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా అశోక్ మాట్లాడుతూ.. చుట్టూ ఇరవై గ్రామాలకు భూగర్భ జలాలు అందిస్తూ వేలాది ఎకరాలకు సాగునీరు అందిస్తున్న బీబీనగర్ పెద్ద చెరువును కాలుష్యం భారి నుండి కాపాడడంలో ఎమ్మెల్యే బాధ్యతారహితంగా ప్రవర్తించడం సరికాదన్నారు. ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్‌రెడ్డి వలిగొండ మండల అభివృద్ధి పట్ల కనబరుస్తున్న శ్రద్ధ బీబీనగర్ ప్రజల ఆరోగ్యం పట్ల ఎందుకు చూపడం లేదని ప్రశ్నించారు.
బీబీనగర్ గ్రామ మురుగునీటి కాల్వలను చెరువులో కలవకుండా డైవర్షన్ చేయడానికి నిధులు కేటాయించాలని, చెరువును కాలుష్యం నుండి కాపాడాలని వివిధ స్థాయి అధికారులకు, ఎమ్మెల్యేకు అనేకసార్లు పిటిషన్లు ఇచ్చినప్పటికీ చలనం లేకపోవడం శోచనీయమన్నారు. బీబీనగర్ చెరువు కాలుష్యంతో చేపలు చనిపోవడం వల్ల వందలాది మత్స్యకార కుటుంబాలు ఉపాధి కోల్పోయి రోడ్డున పడే ప్రమాదం ఉందన్నారు. పర్యావరణ నిబంధనలు తుంగలో తొక్కి, వాల్టా చట్టం-2002 గాలికి వదిలేసి బాధ్యతారహితంగా ప్రవర్తిస్తున్నట్లు దుయ్యబట్టారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో, మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి పాలనలో జరిగిన అభివృద్ధి తప్ప కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో స్థానికంగా ఒక్క అభివృద్ధి పని జరగలేదని విమర్శించారు. బీబీనగర్, రంగాపురం, ఎయిమ్స్ జైనపల్లి గ్రామాల నుండి మురుగునీరు బీబీనగర్ చెరువులో కలుస్తున్నందున బీబీనగర్ మరో ఉప్పల్ చెరువులా మారే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
బీబీనగర్ చెరువు లేకుండా చేయాలనే కొందరు స్వార్ధ భూ కబ్జాకోరుల పన్నాగాలను బీఆర్ఎస్ అడ్డుకుంటుందన్నారు. బీబీనగర్ చెరువు కాలుష్యాన్ని అరికట్టడానికి వెంటనే తగిన నిధులు కేటాయించి డైవర్షన్ కాల్వలను నిర్మించాలని, హామీ ఇచ్చిన విధంగా చెరువును పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు నిధులు తేవాలన్నారు. లేనిపక్షంలో ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్ రెడ్డి తదుపరి బీబీనగర్ పర్యటనను బీఆర్ఎస్ కచ్చితంగా అడ్డుకుంటుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ర్ట నాయకుడు చెంగల వెంకట కిషన్‌రావు, మాజీ సర్పంచ్ మల్లగారి భాగ్యలక్ష్మి శ్రీనివాస్, పార్టీ సీనియర్ నాయకులు గుంటిపల్లి లక్ష్మీనారాయణ, ఎర్రోళ్ల కృష్ణ, దేవరకొండ శ్రీనివాస్, కట్ట నరేశ్, చింతపట్ల నరహరి, వంగరి పరాంకుశం, కుశంగల మురళి, బోయిన కృష్ణ, పంజాల ఈశ్వర్ గౌడ్, పొట్ట శ్రీనివాస్, పేరబోయిన నరేశ్, మర్రి శ్రీకాంత్, ముత్తోజు అశోక్ చారి, సోం శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.
BRS Protest : బీబీనగర్ పెద్ద చెరువును పరిరక్షించాలి : పిట్టల అశోక్