27, 28 తేదీల్లో 2వేల మంది పోలీసులతో బందోబస్తు
450 సీసీ కెమెరాలతో నిఘా
నమస్తే తెలంగాణతో యాదాద్రి
భువనగిరి జోన్ డీసీపీ నారాయణరెడ్డి
‘యాదాద్రి ఆలయ పునఃప్రారంభం
యాదాద్రి భువనగిరి, మార్చి 22(నమస్తే తెలంగాణ ప్రతినిధి) ;సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం ఉంది.. అందుకనుగుణంగా భద్రత ఏర్పాట్లు చేశాం.. హోల్డింగ్ పాయింట్లు, పోలీస్ అవుట్ పోస్టులు, పార్కింగ్ స్థలాలు, కమాండ్ కంట్రోల్ రూం తదితర విభాగాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నాం.. యాదాద్రి చుట్టూ సుమారు 450 సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నాం.. పర్యవేక్షణ కోసం కమాండ్ కంట్రోల్ రూమ్, డ్రోన్ కెమెరాతో నిఘా ఉంటుంది. రాబోయే రోజుల్లో తిరుమల తరహాలో హై సెక్యూరిటీ ఏర్పాటు చేసే దిశగా ప్రణాళికలు సిద్ధం చేశాం’ అని యాదాద్రి భువనగిరి జోన్ డీసీపీ కె.నారాయణరెడ్డి తెలిపారు. ఈ నెల 28 నుంచి స్వయంభువుల దర్శనం ఉన్న నేపథ్యంలో భద్రతపై నమస్తే తెలంగాణ ఇంటర్వ్యూలో పలు విషయాలు వెల్లడించారు.
డీసీపీ : యాదాద్రి ఆలయం ప్రారంభోత్సవం సందర్భంగా చేపట్టాల్సిన ఏర్పాట్లపై ఇటీవల రాచకొండ కమిషనర్ మహేశ్ భగవత్ యాదాద్రికి వచ్చి దిశానిర్దేశం చేశారు. బాలాలయంలో నిర్వహిస్తున్న యాగ కార్యక్రమాలకు భక్తుల అనుమతి లేదు. కానీ, బందోబస్తు పరంగా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. 28న ప్రధానాలయం ప్రారంభోత్సవానికి భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం ఉంది. హోల్డింగ్ పాయింట్లు, పోలీస్ అవుట్ పోస్టులు, పార్కింగ్ స్థలాలు, కమాండ్ కంట్రోల్ రూం తదితర విభాగాల ఏర్పాటుకు సంబంధించి అన్ని చర్యలు తీసుకుంటున్నాం.
నమస్తే తెలంగాణ : 28న సంప్రోక్షణ సందర్భంగా తీసుకుంటున్న ప్రత్యేక చర్యలు ఏమిటి?
డీసీపీ : ఆలయ సంప్రోక్షణ రోజున కాకుండా ఆతర్వాత యాదాద్రి క్షేత్రానికి భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశాలున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని పోలీస్ శాఖ ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నది. సంప్రోక్షణ జరుగడానికి ఒక రోజు ముందు నుంచే 2వేల మందితో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాం. ఏసీపీ మొదలుకుని సీఐలు, ఎస్ఐలు, కానిస్టేబుళ్లు, హోంగార్డులు, ప్రత్యేక బలగాలు బందోబస్తు విధులను నిర్వర్తించనున్నారు. స్వామి దర్శనం కోసం వచ్చే వీఐపీల రాక సందర్భంగా ప్రత్యేక భద్రత ఉంటుంది. క్యూలైన్లలో ఎక్కడైనా రద్దీ ఉంటే సిబ్బందిని అప్రమత్తం చేసి నియంత్రణకు చర్యలు తీసుకుంటాం.
నమస్తే తెలంగాణ : ఎటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు.?
డీసీపీ : యాదాద్రి చుట్టూ సీసీ కెమెరాలను అన్ని చోట్ల ఏర్పాటు చేస్తున్నాం. రాయగిరి కమాన్ నుంచి స్వామి వారి వైకుంఠపాదాల వరకు, రింగ్‌రోడ్డు చుట్టూ, ప్రధానాలయం, శివాలయం, క్యూలైన్లు, బస్టాండ్, నడకదారి, వీఐపీ సూట్స్ ఇలా అన్ని చోట్ల కలిపి సుమారు 450 హై రిజల్యూషన్ సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నాం. పర్యవేక్షణ కోసం కమాండ్ కంట్రోల్ రూం ఉంటుంది. డ్రోన్ కెమెరా పర్యవేక్షణ కూడా ఉంటుంది. రాబోవు రోజుల్లో తిరుమల తిరుపతి తరహాలో హై సెక్యూరిటీ ఏర్పాటు చేసేదిశగా కూడా ప్రణాళికలు సిద్ధం చేశాం.
నమస్తే తెలంగాణ : భక్తులకు రక్షణకు తీసుకుంటున్న చర్యలు?
డీసీపీ : కొండపైకి వచ్చే ప్రతి భక్తుడిపైనా నిఘా ఉంటుంది. కింద నుంచి పైకి చేరుకునే క్రమంలో కింద వారి బ్యాగులు, ఇతరత్రా సామగ్రిని స్కానర్ ద్వారా పరీక్షిస్తాం. కొండపైనా ఇదే తరహాలో పకడ్బందీగా పరిశీలిస్తాం. నిరంతరం పోలీస్ క్రైం టీమ్స్ పర్యవేక్షణ చేస్తుంటాయి. పట్ణణంతోపాటు ఆలయం నలుమూలలా.. పోలీస్ పర్యవేక్షణ పటిష్టంగా ఉంటుంది. దొంగతనాలు, ఘర్షణ పరిస్థితులు తలెత్తకుండా ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేస్తున్నాం. కొంతమంది పోలీసులు మఫ్టీలో ఉంటారు. మహిళల భద్రతకు సంబంధించి షీటీమ్స్‌తో పాటు ప్రత్యేక మహిళా పోలీసు బృందాలు కూడా ఉంటాయి. భక్తులు ప్రశాంతంగా స్వామిని దర్శించుకుని, క్షేమంగా తిరిగి వెళ్లేలా అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నాం.
నమస్తే తెలంగాణ : ట్రాఫిక్ నియంత్రణకు తీసుకుంటున్న చర్యలు?
డీసీపీ : ట్రాఫిక్ పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తాం. రద్దీని తెలుసుకుని ఎప్పటికప్పుడు సిబ్బందిని అప్రమత్తం చేస్తాం. భక్తులు రూట్ మ్యాప్, ఇతర సమాచారం తెలుసుకునేందుకు పోలీస్ సిబ్బంది సహకారం అందిస్తారు. అత్యవసర పరిస్థితుల్లో 100కు డయల్ చేస్తే సత్వర చర్యలు తీసుకుంటాం. యాదాద్రి కొండపైకి ప్రైవేట్ వాహనాలకు అనుమతి లేదు. కొండ కింద కేటాయించిన ప్రదేశంలో వాహనాలను పార్క్ చేసి ప్రత్యేక బస్సుల ద్వారా కొండపైకి చేరుకోవాల్సి ఉంటుంది.
నమస్తే తెలంగాణ : సెల్ఫోన్లు అనుమతిస్తారా?
డీసీపీ : ప్రధాన ఆలయంలోకి ఎట్టి పరిస్థితుల్లో సెల్ఫోన్లకు అనుమతి లేదు. భక్తులు తమ వెంట సెల్‌ఫోన్ తీసుకురావడం పూర్తిగా నిషేధం. కొండ కింద బస్టాండ్ వద్ద ఒక క్లాక్ రూం ఏర్పాటు చేస్తాం. ఇక్కడ యాత్రికుల దుస్తులు, సెల్ఫోన్లు ఇతరత్రా సామగ్రిని భద్రపరుచుకోవచ్చు. తిరిగి కొండ పైన కూడాడ ఒక క్లాక్ రూం ఏర్పాటు చేస్తున్నాం. భక్తులు తమ సెల్ఫోన్లను అక్కడ భద్రపరుచుకోవచ్చు.
యాదాద్రిలో స్వయంభువుల
దర్శనం ఈ నెల 28న పునఃప్రారంభం కానున్నది ప్రస్తుతం యాగానికి సంబంధించిన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. పోలీస్ శాఖ సైతం భక్తుల భద్రత కోసం పకడ్బందీ చర్యలు చేపట్టింది. యాదాద్రిలో భక్తుల భద్రతా పరంగా చేపడుతున్న ఏర్పాట్లు.. శాంతి భద్రతల పరిరక్షణ, ట్రాఫిక్ నియంత్రణ తదితర అంశాలను యాదాద్రి భువనగిరి జోన్ డీసీపీ కే.నారాయణ రెడ్డి మంగళవారం ‘నమస్తే తెలంగాణ’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరించారు.